Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా రంగ సమస్యలపై ఖమ్మం కాలువ ఒడ్డున ప్రారంభం
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ నాయకులకు స్వాగతం
- యాత్రలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. వీరయ్య, పి.శ్రీకాంత్
- జీపు యాత్రను ప్రారంభించిన సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ కార్పొరేషన్
రవాణారంగ కార్మికుల పరిస్థితుల్లో మార్పులు, సంక్షేమ బోర్డు స్థాపన, పెంచిన ఫైన్లను తగ్గించాలని, అనువైన స్థలాల్లో అడ్డాలను ఏర్పాటు చేయాలనే.. డిమాండ్లతో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్- సీఐటీయూ) ఆధ్వర్యంలో రవాణారంగ కార్మికుల సంఘర్ష్ (జీపు) యాత్రను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఖమ్మం కాల్వొడ్డులో మంగళవారం ప్రారంభించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. వీరయ్య, పి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇక్కడ ప్రారంభమైన యాత్ర జనవరి 11న సంగారెడ్డిలో ముగుస్తుందన్నారు. 12 లక్షల మందికి పైగా పనిచేస్తున్న రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే చిన్న ప్రమాదం జరిగినా సహాయం అందదన్నారు. ఏఐఆర్‌టీడబ్ల్యుఎఫ్ ఆలిండియా కమిటీ 2006లో అప్పటి ప్రధానికి ఇచ్చిన విపతిపత్రం మేరకు 'వి.వి. గిరి నేషనల్ ఇనిస్టిట్యూట్' రవాణారంగ కార్మికుల్లో అధ్యయనం చేసి 1,200 పేజీల నివేదికను 2007లోనే ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. దేశవ్యాప్త సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ఒక్క కార్మికుడు పనిచేస్తున్న చోట కూడా ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నదన్నారు. తెలంగాణలో కూడా ఆ తరహా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం రవాణా రాష్ట్రాల పరిధిలో ఉన్నదని, కానీ కేంద్ర ప్రభుత్వం ఎం.వి. యాక్ట్-2019ని తీసుకువచ్చి, మొత్తం రవాణారంగాన్ని తన పరిధిలోకి తీసుకుంటున్నదని చెప్పారు. కేంద్రం పర్మిట్స్ సరళతరం చేస్తే ప్రమాదాల రేటు పెరుగుతుందన్నారు. పెనాల్టీలు, పనిష్మెంట్లను విపరీతంగా పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గిస్తామని చెప్పడం మరో బూటకమని తెలిపారు. వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు రవాణా రంగంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రజల్లో చైతన్యం పెంచాలని, ప్రజా రవాణాను (ఆర్ సీని) మెరుగుపర్చాలన్నారు. రూ. 500ల నుంచి రూ.లక్ష ఫైన్‌తో పాటు, 3 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధిస్తున్నారని తెలిపారు. సిగల్ జంప్, స్టాయ్లాన్ దాటితే, తప్పు ఓవర్ టేక్ వంటి వాటికి రూ. 10,000ల వరకు ఫైన్ వేస్తున్నారన్నారు. అన్నిరకాల వాహనాలు ఆథరైజ్డ్ షోరూమ్‌ల్లోనే రిపేర్లు చేయించాలని, ఆ ఒరిజినల్ కంపెనీ వస్తువులనే వాడాలనడం ప్రజలపై భారాలు మోపడమేనని విమర్శించారు. కార్మికులు, ప్రజలకు నష్టం కలిగించే అనేక అంశాల్లో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పెను ప్రమాదంలోకి నెట్టబడుతున్నదని, దాని రక్షణ కోసం భారత రాజ్యాంగం 1970లో రాజ్యాంగ సవరణ చేసిన ఎం.వి. యాక్ట్ -1988 సెక్షన్ 11కు రక్షణ కల్పించారన్నారు. కానీ 2019 చట్టంలో దాని గురించి ఏమీ మాట్లాడకుండానే, అప్పటివరకు ఉన్న పర్మిట్ విధానంలో మార్పులు చేస్తూ కాంట్రాక్ట్ క్యారేజీ, స్టేజ్ క్యారేజీలుగా ఉన్న పర్మిట్లను నేషనల్ పర్మిట్‌గా మార్పు చేసి, ప్రయివేటు వాహన యజమానులను కూడా ఆర్టీసీ లాగా స్టేజీ క్యారేజులుగా నడుపుకునే అవకాశం కల్పించారని ఆరోపించారు. ఆర్టీసీ యాక్ట్ 1950 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 రేషియోలో మూలధన పెట్టుబడి పెట్టాలన్నారు. ఆర్టీసీ ఇస్తున్న సబ్సిడీలను కూడా పూర్తిగా తిరిగి చెల్లించడం లేదన్నారు. ప్రజల రవాణాకు అయ్యే ఖర్చు అనేక రెట్లు పెరుగుతుందన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకోవలసిన అవసరం ప్రజలందరిపై ఉన్నదన్నారు. ఆర్టీసీ కార్మికోద్యమంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు అగ్రిగేటర్స్ సంస్థల దోపిడీ నుంచి, కేరళ రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వ ''సవారీ'' అనే యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నదని, ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కేవలం 8% కమిషన్‌తో నడుపుతుంటే, దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థను తీసుకొస్తే ఆ కమిషన్‌ను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చన్నారు.
కాల్వొడ్డు నుంచి డిపో వరకు ర్యాలీ..
ఖమ్మం కాల్వొడ్డు నుంచి వందలాది ఆటోలతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొంటున్న నాయకులకు పూలమాలలు వేశారు. అక్కడి నుంచి జూబ్లీక్లబ్, ఓవర్ బ్రిడ్జి, మయూరి సెంటర్ మీదుగా యాత్ర బస్ డిపో వరకు సాగింది. అక్కడ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో పూలు చల్లుతూ నాయకులను స్వాగతించారు. ఈ సందర్భంగా నాయకులు ఖమ్మం డిపోలో కలియతిరిగారు. గ్యారేజీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం యాత్ర పునప్రారంభమైంది. ఖమ్మం నుంచి తిరిగి యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. రాత్రి బస భద్రాచలంలో ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూరపాటి రమేష్, ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్, జిల్లా ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.విక్రమ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీకాంత్, మోహన్‌రావు, జిల్లా సహాయ కార్యదర్శులు రమ్య, బండారు యాకయ్య, హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్య శ్రీను, ఏరియా నగరపాలక సంస్థ కార్పొరేటర్ వెంకట్రావు, ఆర్టీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఆర్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి ఎస్కే పర్వీన్, రాష్ట్ర కార్యదర్శి జె.పద్మావతి, ఖమ్మం డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ జి రామారావు, మాధవరావు, డిపో సహాయ కార్యదర్శి పి.నరసింహారావు, ఖమ్మం, మధిర డిపోల నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.