Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి ఆల్‌టైం రికార్డు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి సంస్థ రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్ నెలలో 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధికం. గత ఏడాది డిసెంబర్ నెలలో సాధించిన దానికన్నా 19 శాతం అధిక ఉత్పత్తిని సాధించింది. రోజుకు సగటున 2 లక్షల 18 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపి మరో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ సంస్థ డైరెక్టర్లు, ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పై అంశాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 80 రోజులు అత్యంత కీలకమనీ, రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని ఆదేశించారు. ఇది సింగరేణి చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా నమోదు చేస్తుందని తెలిపారు. ఫలితంగా సంస్థ టర్నోవర్ 34 వేల కోట్లకుపైగా చేరి, అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మణుగురు, కొత్తగూడెం, రామగుండం రీజియన్, అండ్రియాల ప్రాజెక్టుల నుండి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడంపై సంతోషం వ్యక్తం చేశారు.