Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఆస్పత్రుల్లోనూ సేకరణకు సౌకర్యాలు
- అవగాహనా కార్యక్రమాలను ముమ్మరం చేసిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అవయవదానాల్లో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2016 నుంచి 2021 వరకు అందుకు సంబంధించిన గణాంకాలను విశ్లేషిస్తే మొత్తం అవయవాదానాల్లో 53 శాతం నాలుగు రాష్ట్రాల నుంచే వచ్చినట్టు గుర్తించారు. ఆయా లెక్కల ప్రకారం మొదటి స్థానంలో ఢిల్లీ, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. మరణించిన వారి నుంచి వచ్చిన అయవాల కన్నా జీవించిన కాలంలో అవయవాల సేకరణ ఎక్కువగా ఉండటం గమనార్హం. అవయవమార్పిడి శస్త్రచికిత్సలు అనేక మందికి ప్రాణం పోస్తున్నాయి. అయితే వాటికున్న డిమాండ్, లభ్యత మధ్య గ్యాప్ ఇప్పటికీ ఎక్కువగా ఉంటున్నది. ఈ సమస్య నుంచి అధిగమించేందుకు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) విడుదల చేసిన గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. కరోనా ప్రభావం కారణంగా 2020లో అవయవదానాలు తగ్గగా, 2021లో మునపటి పరిస్థితి వచ్చింది. 2016లో అవయవదానాలు సంఖ్య 9,046 ఉండగా, 2017 నాటికి అది కాస్తా 9,581కు పెరిగింది. ప్రతి ఏటా పెరుగుతూ వచ్చి 2020లో మాత్రం 7,519కుతగ్గింది. అంతకు ముందు ఏడాది అంటే 2019లో 12,746గా నమోదైంది. 2020లో భారీగా తగ్గడానికి కరోనా మహమ్మారి కారణంగా గుర్తించారు. అవయవాలను రెండు రకాలుగా సేకరిస్తారు. జీవించిన వారి నుంచి ఒక మూత్రపిండం, కాలేయ, ఊపిరితిత్తులు, పాంక్రీయాసిస్ లలో భాగాన్ని సేకరిస్తారు. అదే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి కండ్లు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రీయాసీస్ తదితర అవయవాలను తీసి ఇతరులకు మార్పిడి చేసి బతికిస్తుంటారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో అవయవాల దానం ఎక్కువగా జరుగుతున్నది. చెన్నై, హైదరాబాద్, ముంబయి, పుణె వంటి నగరాలు మెడికల్ హబ్‌లుగా పేరుగాంచడంతో ఎక్కువగా ఆయా రాష్ట్రాల్లో అవయవదాన మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతన్నట్టు భావిస్తున్నారు. 2016 నుంచి 2021 సంవత్సరం వరకు ఢిల్లీలో 11,181 జరగగా, తమిళనాడులో దాదాపు 10 వేలు ఉండగా, తెలంగాణలో 4,354 అవయవాలను దానం చేశారు. వాటి మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో దాతల సంఖ్య కూడా అదే విధంగా పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీహెచ్ఎస్ సూచించింది.
జిల్లాలకు విస్తరణ
అవయవదానంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ, ఆ స్ఫూర్తితో అవయవాల సేకరణ, ఇతర సౌకర్యాలను మెరుగు పరుచుకునేం దుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే జిల్లాల నుంచి వచ్చిన వారికి ఉన్నతాధి కారులు, సంబంధిత నిపుణులతో శిక్షణనిప్పించారు.