Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగదు బదిలీ పథకం కింద పదిహేను రోజుల్లో గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలంటూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. పదిహేను రోజుల్లోగా నూరు శాతం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం నల్లగొండ, యాదాద్రి భువన గిరి జిల్లాల్లో లబ్దిదారులకు ఒక్కొక్కరికి ప్రభుత్వ వాటా ధనం రూ. 1.58 లక్షల చొప్పున వారి ఖాతాలకు నగదును బదిలీ చేసిందని వివరించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో 4,699 మంది లబ్ది దారుల ఖాతాలలో ప్రభుత్వ వాటాను జమ చేశామనితెలిపారు. ఉప ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆయా యూనిట్ల పంపిణీ ఆలస్యమైందని వివరించారు. ఈ క్రమంలో ఇప్పుడు 15 రోజుల్లో వారందరికీ గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా పశువైద్యాదికారులను మంత్రి ఫోన్లో ఆదేశించారు.
మత్స్యకారుల సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్
మత్స్యకారుల సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. మూడు నెలలపాటు నిర్వహించే ఆ కార్యక్రమంలో లక్షా 30వేల మందికి సభ్యత్వాలు కల్పించాలని కోరారు. మంగళవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. 18 ఏండ్లు పూర్తయిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాన్ని అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నీటి వనరులో చేపపిల్లలు ఉండాలని ఆదేశించారు. ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ పేరుగాంచిందన్నారు.