Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకాల నిర్వహణ ప్రయివేటీకరణను రాష్ట్ర సర్కారు అడ్డుకోవాలి
- వారిని పర్మినెంట్ చేసి రూ.26 వేల వేతనమివ్వాలి :
స్కీమ్‌వర్కర్ల సమస్యలపై స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల ఆరోతేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని స్కీమ్ వర్కర్లకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.పద్మ, పి.జయలక్ష్మి, కోశాధికారి కె.సునీత పిలుపునిచ్చారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... 72 పథకాల్లో దేశవ్యాప్తంగా కోటిమంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారనీ, మన రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సేవలను పేదలకు అందించడంలో వారిది కీలకపాత్ర అని తెలిపారు.
వారికి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటం, మరోవైపు చాలీచాలని గౌరవ వేతనాలతో స్కీమ్‌వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సీఐటీయూ పోరాటాల ఫలితంగా 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలివ్వాలనీ, ప్రయివేటీకరణను ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు. మన పాలకులు దాన్ని ఎనిమిదేండ్లయినా అమలు చేయట్లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు నిధులను తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు.
పథకాల నిర్వహణను ప్రయివేటుకు అప్పగిస్తే స్కీమ్‌వర్కర్లు ఉపాధి కోల్పోవడంతో పాటు పేదలకు వారు అందించే సేవలు దూరమవుతాయని తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. డిజిటల్ హెల్త్ మిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకోవాలనీ, పథకాలకు బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. స్కీమ్వర్కర్లను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. రూ.10వేల పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలను కలించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ స్కీమ్ వర్కర్లకు ఒకే సర్వీస్ రూల్స్ రూపొందించాలని కోరారు.