Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశానికి మొదటి చదువుల తల్లి, క్రాంతిదర్శిని సావిత్రిబాయి ఫూలే అనీ, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి ముందుకుతీసుకుపోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో ఉన్న రాజ్‌బహదూర్ గౌర్ హాల్లో మంగళవారం సావిత్రిబాయి పూలే 192వ జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యిద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ చదువు ప్రధానమైన ఆయుధమంటూ ఆనాడే ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ చదువు కోసం పరితపించిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి ఫూలే అని ఆమె సేవలను కొనియాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూనేలో బాలికలకోసం పాఠశాల స్థాపన జరిగిందన్నారు. కులాలకతీతంగా బాలికలను పాఠశాలల్లో చేర్పించి, మహిళల హక్కులే మానవహక్కులంటూ ఆమె చేసిన నినాదం స్త్రీలపై చాలా ప్రభావం చూపిందని గుర్తు చేశారు. మహిళలపై జరిగే మూఢాచారాలపై ఆమె గళం విప్పారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి ఆర్పి రంగాచార్యులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్, కలవేణి శంకర్, భాగం హేమంత్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ రెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, గోదా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.