Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రికి టీడీపీ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గొల్ల కురుమల ఖాతాలో ప్రభుత్వం జమా చేసిన నగదుతో గొర్రెలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలని రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలుగుదేశం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని వివరిస్తూ హైదరాబాదులో యాదవ సంఘం నాయకులతో కలిసి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ముందు నియోజకవర్గంలోని 7600 మంది గొల్ల కురుమలకు గొర్రెల పథకంలో గొర్రెలకు బదులుగా రూ.1.58 లక్షలను జమ చేసి ఖాతాలను ఫ్రీజ్ చేశారనీ, దాన్ని ఎత్తేయాలని కోరారు. ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే డబ్బులు డ్రా చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చని చెప్పి రెండు నెలలు అవుతున్నా,పట్టించుకోవడం లేదని చెప్పారు. నియోజక వర్గంలో ఎంపిక చేయబడి డీడీలు కట్టని వారికి కూడా గొర్రెలు కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని సూచిం చారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెంటనే పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రామచంద్రతోపాటు, ఇతర అధికారులను వెంటనే పిలిచి మాట్లాడారు. గొర్రెలకు కొనుగోలుకు చర్యలు చేపట్టాలనీ, ఈనెల 12వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్ట్లర్లతో ఫోన్లో మాట్లాడారు. ఇతర శాఖల డబ్బులను తీసుకునేందుకు ఫ్రీజింగ్‌ను తొలగించాలనీ, గొర్రెల కొనుగోలుపై గొల్ల కురుమల అభిప్రాయాలు తీసుకుని ఇతర రాష్ట్రాల్లో వారికి నచ్చిన చోట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయ కులు వంగూరు సత్తయ్య యాదవ్, ఈడుదుల ఐలయ్య. కుట్ల నర్సింహ, బొచ్చెనగోని సుభాష్ , వంగూరి యాదయ్య జగన్ పాల్గొన్నారు.