Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్వింటల్ పత్తికి రూ.12వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడు శోభన్ డిమాండ్ చేశారు. మార్కెట్లలో దోపిడీ అరికట్టాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. గత వారం రోజులుగా మార్కెట్లలో క్వింటాల్ పత్తికి రూ. 7వేలకు తగ్గించడం ద్వారా మధ్య దళారులు విపరీతంగా లాభాలు పొందుతున్నారని చెప్పారు. కనీసం మద్దతు ధర రూ. 6380 ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి ఈసారి రూ. 9,800లకు అక్కడ అమ్మకాలు సాగాయని చెప్పారు. అక్కడ మార్కెట్లో ఇప్పటికీ అదే ధర కొనసాగుతుందని వివరించారు. రాష్ట్రంలో వ్యాపారులు మిలాఖత్ అయి ధరను రూ. 7వేలకు తగ్గించారని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పేరు చెప్పి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారనీ, అధిక వర్షాలతో ఎనిమిది లక్షల ఎకరాలలో పత్తి పంట పూర్తిగా దెబ్బ తిన్నదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక క్యాండీ దూది ధర రూ. 90వేలుగా ఉందన్నారు. ఒక కిలో దూది ధర రూ 265గా ఉందని తెలిపారు. ఇక్కడ మాత్రం కిలో దూది ధర రూ. 150కు మించి ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో పత్తిని సీసీఐ కొనుగోలు చేసి, అంతర్జాతీయ మార్కెట్ ధరలను చూస్తే ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఈసారి రైతులు బాగా దివాళా తీశారని తెలిపారు. ఇలాంటి స్థితిలో వాళ్లకు ధరలు తగ్గిస్తే అప్పులపాలై ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి రైతుకు బోనస్‌ను ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలనీ, లేకపోతే రైతాంగాన్ని కదిలించి ఆందోళన, పోరాటాలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.