Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
- ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
నవతెలంగాణ-ముషీరాబాద్
''బ్రాహ్మణీయ సమాజం అనేక ఆటంకాలను సృష్టించినప్పటికీ మొక్కవోని దీక్షతో పేదలకు చదువునేర్పిన దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే.. ఆమె పుట్టిన రోజు జనవరి 3న దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి'' అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ఫూలే జయంతి, విద్యారంగం.. సామాజిక న్యాయం' అంశంపె కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.దశరథ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్, టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి జి.రాములు, స్కైలాబ్ బాబు పూలమాలలు వేశారు.
అనంతరం స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. విద్య అందరికీ అందకుండా కుట్రపూరితంగా కేంద్రం లోని బీజేపీ సర్కార్ నూతన విద్యా విధానం తెచ్చిం దన్నారు. కామన్ స్కూల్ విధానం రావాలన్నారు. జూపాక సుభద్ర మాట్లాడుతూ.. మూడువేల ఏండ్ల మనుస్మృతి దాస్యసుంకలాలను తెగ నరికిన తొలి వీర వనిత సావిత్రిబాయి ఫూలే అన్నారు. దేశంలో నేటికీ 64 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందన్నారు. నాడు ఫూలే దంపతులు శూద్రులకి, మహిళలకు, పేదలకు చదువు నేర్పి ఉండకపోతే ఈరోజు ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఏ హక్కులూ ఉండేవి కావన్నారు. ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్ట చూస్తున్నదన్నారు. దీనిని అడ్డుకుని కామన్ స్కూల్ విధానం తీసుకురావాలన్నారు. జి.రాములు మాట్లాడుతూ.. తరతరాల చీకటిని విద్య ద్వారా తరిమేసిన దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు టి.సుబ్బారావు, నాయకులు బి.పవన్, జగదీష్, కామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.