Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణ తేదీలు తెలిపేలా రేషన్ షాప్స్, పంచాయతీ ఆఫీసుల వద్ద బోర్డులు
- ఈ నెల 12లోగా జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేయాలి
- పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలి : మంత్రి హరీశ్‌రావు
- కంటి వెలుగు క్యాంపుల వివరాల బుక్లెట్ అవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరంచేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థలు, ఇతర ప్రజా ప్రతినిదులందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలనీ, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. కంటి వెలుగు సన్నద్ధతపై మంగళవారం మంత్రుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అవసరం ఉన్న వారందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహిస్తు న్నట్టు చెప్పారు. పరీక్షలతో పాటు ఉచితంగా, మందులు, కండ్లద్దాలు ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాల్లో ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని వంద పని దినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం 1,500 బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుందన్నారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏఎన్ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభా నికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేస్తామని తెలిపారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోపే ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈనెల 12లోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటి వెలుగు సమావేశాలు ఏర్పాటు చేయాల న్నారు. అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లోనూ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని కోరారు. రేషన్ షాపుల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో క్యాంప్స్ నిర్వహణ తేదీలు ప్రచురించాలని ఆదేశించారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్‌లలో కంటి వెలుగుపై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు.