Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లుగా వేతనాలు పెంచడం లేదని ఆవేదన
- విధులు బహిష్కరించి మెట్రో స్టేషన్ల ఎదుట నిరసన
- ఎల్బీనగర్-మియాపూర్ స్టేషన్లో టిక్కెటింగ్ వ్యవస్థపై సమ్మె ఎఫెక్ట్
- ఉద్యోగులతో హెచ్ఎంఆర్ మేనేజేమెంట్ చర్చలు.. సమ్మె తాత్కాలిక విరమణ
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం రోడ్డెక్కారు. ఐదేండ్లుగా వేతనాలు పెంచడం లేదని ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్లోని మెట్రో స్టేషన్లలో సమ్మె చేపట్టారు. టికెటింగ్ ఉద్యోగుల ఆందోళనతో మెట్రో స్టేషన్లోని టికెటింగ్ వ్యవస్థపై కొన్ని గంటలపాటు సమ్మె ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు కొంతకాలంగా తమకు సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. దాదాపు ఐదేండ్లుగా 11 వేల రూపాయల వేతనం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగంలో సరైన సమయం లేదని.. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొక రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరవ్వబోమని, దీనిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు సిబ్బంది ఆందోళనపై కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ ప్రతినిధులు స్పందించారు. టికెటింగ్ సిబ్బంది ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ట్రైన్ ఆపరేషన్ నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదన్నారు. సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ఆందోళన చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. చర్చలు జరుపుతామని హామీ ఇచ్చినా టికెటింగ్ స్టాఫ్ ఆందోళన కొనసాగించారు.
దీంతో కియోలిస్ ప్రతినిధులు అమీర్పేట మెట్రోస్టేషన్లో వారితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ముగిసిన అనంతరం మెట్రో టికెటింగ్ సిబ్బంది మాట్లాడుతూ.. తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నామని.. మరోసారి చర్చలకు రావాలని యాజమాన్యం కోరిందని చెప్పారు. ప్రధానంగా వేతనాలు పెంచాలని తాము డిమాండ్ చేశామన్నారు. మరోసారి కియోలిస్ ప్రతినిధులతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.
టిక్కెటింగ్ సిబ్బంది ఆందోళన సహేతుకం కాదు
హెచ్ఎంఆర్ మేనేజేమెంట్ ప్రకటన
మెట్రో రైల్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ ఉద్యోగులు సమ్మె చేపట్టడంపై హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) మేనేజ్మెంట్ స్పందించింది. కాంట్రాక్టింగ్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న కొంతమంది టిక్కెటింగ్ సిబ్బంది సమ్మె సహేతుకం కాదని, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగించారని చెప్పింది. తమ స్వార్థ ప్రయోజనం కోసం తప్పుడు సమాచారం, పుకార్లను సైతం వ్యాప్తిచేస్తున్నారని వెల్లడించింది. సమ్మెపై వాదనలు తప్పని తెలిపింది. వారిపై కఠిన చర్యలను తీసుకోవాల్సిందిగా హెచ్ఎంఆర్ మేనేజ్మెంట్ కోరుతోందని వెల్లడించింది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను మేనేజ్మెంట్ అందిస్తుం దని, వారు మరింతగా ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరపనున్నట్టు మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.