Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో
20 ప్రాంతాల్లో సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి :
ప్రముఖ ఎక్సెల్ టైర్ల కంపెనీ షోరూమ్‌లపై ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం మెరుపుదాడులను నిర్వహించారు. హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఎక్సెల్‌కు చెందిన 20 షోరూమ్‌లపై ఐటీ అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి సోదాలను ప్రారంభించారు. 20కి పైగా ఐటీకి చెందిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎక్సెల్ కంపెనీలో సోదాలు నిర్వహించినట్టు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని మైండ్ స్పేస్ వద్ద గల ఎక్సెల్ కార్పొరేటు కార్యాలయంతో పాటు బాచుపల్లి, రంగారెడ్డి, మియాపూర్‌లలోని ఎక్సెల్‌కు చెందిన దాదాపు 20 షోరూమ్‌లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన చెల్లింపులు, కంపెనీ సాధించిన ఆదాయం, వ్యయాలకు సంబంధించిన పలు రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనపర్చుకున్నట్టు తెలిసింది. ఐటీ చెల్లింపుల్లో ఎక్సెల్ యాజమాన్యం భారీ మొత్తంలోనే అవకతవకలకు పాల్పడినట్టు ఐటీ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది.