Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీం రెడ్డి నరసింహారెడ్డి (బీఎన్) శత జయంతి వార్షికోత్సవ సభ ఈనెల తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓంకార్ భవన్లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎన్ శతజయంతి వార్షికోత్సవ సభను ఈనెల తొమ్మిదో తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ తమ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీఎన్ శతజయంతి వార్షికోత్సవాలను గతేడాది మార్చి 15 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని వివరించారు. 'వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి- రాజకీయ సామాజిక అంశాలపై బీఎన్ ప్రభావం' అనే అంశంపై పలువురు వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, వనం సుధాకర్, వరికుప్పల వెంకన్న, వి తుకారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.