Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ మెట్రోరైల్ టికెట్ కౌంటర్స్ సిబ్బందికి జీవో ప్రకారం వేతనాలివ్వాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మెట్రోలో ఏజెన్సీ ద్వారా ఐదేండ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి నెలకు కేవలం రూ.11 వేలు మాత్రమే ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. రిలీవర్స్ రాకపోతే భోజన విరామం కూడా ఇవ్వకుండా డబుల్ డ్యూటీ చేయించడం ఇంకా అన్యాయమని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని తెలిపారు. టికెట్ కౌంటర్ సిబ్బంది శ్రమను మెట్రో రైల్ యాజమాన్యం గుర్తించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని జీఓ 63 ప్రకారం కనీస వేతనాలు నిర్ణయించాలని కోరారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మెట్రో రైలు యాజమాన్యమే సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.