Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా జానపద వృత్తి కళాకారులు ఈ నెల 10న తలపెట్టిన శోభాయాత్ర పోస్టర్ను జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండూరి భాస్కర్ ఆవిష్కరించారు. బాగ్లింగంపల్లి స్వామి వివేకానంద విగ్రహం వద్ద బుధవారం పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కళాకారుల సమస్యలపై ఆ విగ్రహం నుంచి బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయం వరకు శోభాయాత్ర ఉంటుందని తెలిపారు. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా విజయ శంకర స్వామీజీ అన్నమయ్య, గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు అన్నమయ్య, కళాక్షేత్ర పీఠాధిపతి, శోభాయాత్ర ప్రారంభకులు కళాబంధు, సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి.అనూహ్యరెడ్డి, పలువురు స్వాములు, సామాజిక నేతలతో పాటు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి అనేకమంది జానపద వృత్తి కళాకారులు హాజరవుతున్నారని తెలిపారు. అంధ విశ్వాసాలు, మతమార్పిడిలు ప్రగతి నిరోధకా లంటూ స్వామి వివేకానంద ప్రబోధించారని తెలిపారు. ఏకాగ్రత సాధన ప్రక్రియలు విజయానికి సోపానాలంటూ ఆయన బోధించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ భూపతి వెంకటేశ్వర్లు, జానపద వృత్తి కళాకారుల సంఘం సోషల్ మీడియా కన్వీనర్ పి.కళ్యాణ్, హైదరాబాద్ జిల్లా నాయకులు బి.పవన్ తదితరులు పాల్గొన్నారు.