Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయాలు తలకిందులుగా
నడుస్తున్నాయి : ప్రొఫెసర్ హరగోపాల్
త్యాగాల వక్రీకరణ జరుగుతోంది :చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - భువనగిరి
తెలంగాణ సాయుధ విప్లవ పోరాట యోధులు జైని మల్లయ్య గుప్తా జీవితం నేటి యువతకు ఆదర్శమని ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం ఎడిటర్ సంకోజు వేణుగోపాల్ తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో బుధవారం జైని మల్లయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫాసిజం ఎంతో ప్రమాదకరమని తెలిపారు. జైని మల్లయ్య ఊపిరి ఉన్నంతకాలం హిందుత్వ ఫాసిజంపై పోరాడారని చెప్పారు. దేశంలో నేడు రాజకీయాలు తలకిందులుగా నడుస్తున్నాయన్నారు. జైని మల్లయ్య పోరాటం, విలువల ద్వారా వచ్చిన స్ఫూర్తిని జీవితాంతం కొనసాగించినట్టు తెలిపారు. నేటి సమాజంలో సామాజిక విలువలు విధ్వంసమవుతున్నాయన్నారు. ఫాసిజం పిచ్చి ఎక్కడికి పోతదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత విశ్వాసాలు విషంగా మారొద్దని తెలిపారు. దీనిపై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. నేడు గత త్యాగాల వక్రీకరణ జరుగుతోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. భూమి, భుక్తి, వెట్టి నుంచి విముక్తి కోసం పదహారేళ్ల పసిప్రాయంలోనే జైని మల్లయ్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నిజాం వ్యతిరేక ఉద్యమంతోపాటు అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారన్నారు.తూర్పు మల్లారెడ్డి, సామ మల్లారెడ్డి మాట్లాడుతూ.. సాహితీ మిత్రమండలి స్థాపనలో ప్రారంభమైన జైని మల్లయ్యతో తమ పరిచయాన్ని నెమరు వేసుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగాలు హిమాలయాల కన్నా ఉన్నతమైనయని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనను అంతం చేసి గ్రామాల్లో కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గుండె బలాన్ని చూపుతుందన్నారు. జైని మల్లయ్య పేరు మీద బహుమతులు అందజేయాలని కోరారు. ఆయన స్మారకార్థం భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 'గుప్తా జీవిత వ్యక్తిత్వం' పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక కార్యకర్త హమీద్ పాషా స్వాగతం పలుకగా, కాచరాజు జయప్రకాష్ వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు ఎండి.జహంగీర్, గోదా శ్రీరాములు, గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మాటూరి బాలరాజు, ఎశాల అశోక్, కుటుంబీకులు జైని రమేష్, రవీందర్, మధు ప్రకాష్ పాల్గొన్నారు.