Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృతదేహంతో రైతుల ఆందోళనకు యత్నం
అడ్డుకున్న పోలీసులు
కామారెడ్డిలో ఉద్రిక్తత
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతోందన్న బెంగతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగింది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 45 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీన్, ఇండిస్టియల్ జోన్లలో లింగాపూర్, ఇల్చిపూర్, అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాల నుంచి సుమారు 1200 ఎకరాల భూమి రైతులు కోల్పోతున్నారు. అయితే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు(38) తన భూమి ఇండిస్టియల్ జోన్లో పోతుందని, భూమికి డబ్బులు ప్రభుత్వం ఇస్తుందో లేదోనన్న బెంగతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మృతదేహంతో కామారెడ్డి మున్సిపాలిటీ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో ఒక్కొక్కరుగా కామారెడ్డి మున్సిపాలిటీ వద్దకు రైతులు చేరుకోవడంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి గేటుకు తాళం వేశారు.
మున్సిపల్ కమిషనర్ ఘెరావ్..
మున్సిపల్ కార్యాలయంలో రైతులున్న సమయంలో మధ్యాహ్నం భోజనం చేయడానికి కారులో వెళ్తున్న కమిషనర్‌ను రైతులు ఘెరావ్ చేశారు. కమిషనర్ కారును అడ్డుకుని 'అన్నం పెట్టే రైతు భూమి దక్కదని ఆత్మహత్య చేసుకుంటే.. ఆ భూములు లాక్కోవడానికి మాస్టర్ ప్లాన్ చేసిన మీరు ఎక్కడికి వెళ్తారంటూ' కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చేసేదేమిలేక కమిషనర్ కార్యాలయం లోపలికి తిరిగి వెళ్లిపోయారు.
ఆందోళన మధ్య పోస్టుమార్టంకు మృతదేహం
రైతులు అడ్లూర్ ఎల్లారెడ్డి నుంచి ట్రాక్టర్లో రాములు మృతదేహాన్ని కామారెడ్డి వరకు తీసుకువచ్చారు. మృతదేహంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న ట్రాక్టర్‌ను కామారెడ్డి పోలీసులు కొత్త బస్టాండు వద్ద అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు పెద్దఎత్తున కొత్త బస్టాండ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సుమారు గంట పాటు పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో రైతులు నడిరోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ వద్ద ఆందోళన చేయడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మున్సిపల్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోతే ఇటునుంచి మృతదేహాన్ని ఎమ్మెల్యే ఇంటికి తరలించి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.