Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మికవర్గ పోరాటాలు మరింత పెరగాలి
సీఐటీయూ ఏపీ రాష్ట్ర మహాసభలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయనీ, ఈ నేపథ్యంలో కార్మికవర్గానికి చేస్తున్న అన్యాయంపై పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం మరింత పెరిగిందని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం(సున్నం రాజయ్యనగర్)లో ముగిసిన సీఐటీయూ ఏపీ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న ఆయన సౌహార్ద్ర సందేశాన్ని ఇచ్చారు. పాలకుల విధానాలను ప్రతిఘటిస్తూ మూడేండ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సమరశీల పోరాటాలు, సమ్మెలను గుర్తుచేశారు. వాటికి కార్మిక వర్గం నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే పోరాట ఒరవడిని కొనసాగిస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ చట్టం, నూతన విద్యావిధానం, నేషనల్ మానిటైజేషన్ పైపులైన్, తదితర నిర్ణయాలకు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది కార్మికులను పోరాటాల్లో దింపాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్, హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కార్మిక వర్గంలో ఐక్యతా స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. ప్రస్తుత సంక్షిష్ట పరిస్థితుల్లో ఐక్యఉద్యమాలకు చొరవ చూపాల్సిన ఆవశ్యకత పెరిగిందని నొక్కిచెప్పారు. ఐక్యపోరాటాల రూపకల్పనలో సీఐటీయూ ముందువరుసలో ఉంటుందని తెలిపారు.