Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెండా ఎజెండా కోసం నిరంతరం పోరాటం : సంతాప సభలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
కాసర్ల కమలమ్మ గొప్ప పోరాట యోధురాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 16వ వార్డు బాదేగూడెం గ్రామంలో బుధవారం కాసర్ల కమలమ్మ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమలమ్మకు సాయుధ పోరాటంలో ఒక చరిత్ర ఉందన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం చిన్నతనం నుండే కమలమ్మ వీరోచిత పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. దోపిడీ లేని సమసమాజం కోసం సాయుధ పోరాటంలో ముందుండి పోరాడారని తెలిపారు. ఆమె ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కాసర్ల కమలమ్మ వ్యక్తి కాదు.. సమూహ శక్తి అని అభివర్ణించారు. పార్టీ జెండా ఎజెండా సాధన కోసం కమలమ్మ అనునిత్యం ఉద్యమించారని చెప్పారు. నేటి ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు పాలిస్తున్న దేశాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయని తెలిపారు. సమాజంలో దోపిడీ ఉన్నంత వరకు కమ్యూనిస్టు పార్టీ మనుగడలో ఉంటుందని తెలిపారు. ఆమె కుటుంబీకులు కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాసర్ల కమలమ్మ త్యాగం వెల కట్టలేనిదని, ఆమె తుదిశ్వాస వరకు గొప్పగా పనిచేసిన వీర వనిత అని కొనియాడారు. రజాకార్లు జరిపిన కాల్పుల్లో తన సహచరులు మరణించినా, కమలమ్మ తీవ్రంగా గాయపడి తిరిగి కోలుకొని పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని కాసర్ల కమలమ్మ ఉద్యమ పంథాను కొనసాగించారని తెలిపారు. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండీ. సలీం అధ్యక్షతన జరిగిన సంతాప సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హషం, నాయకులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, దండంపల్ల్లి సరోజ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, నాయకులు పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఊట్కూరు నారాయణరెడ్డి, కమలమ్మ కుమారుడు కాసర్ల గౌతంరెడ్డి, కూతురు నర్మద తదితరులు పాల్గొన్నారు.