Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ నేత బండి సుధాకర్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చిన్న రాష్ట్రాల ఏర్పాటు, వాటి ఆవశ్యకతపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండి సుధాకర్‌గౌడ్ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది యువకులు తమ నిండు ప్రాణాలను బలితీసుకునేలా కేసీఆర్ రెచ్చగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ అమరుల ఆత్మ ఘోషించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'ఆంధ్రోళ్లు వద్దు తెలంగాణ ముద్దు' అంటూ అధికారంలోకి రాగానే అక్రమార్జన ద్వారా సంపాధించిన కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ... తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 'మూడు సీబీఐ కేసులు, ఆరు ఈడీ కేసులు' అనే తీరు నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల వివాదాలు, ఆస్తుల పంపకాలపై బీఆర్ఎస్ విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆరోపించారు. ఆనాడు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చితే ఈనాడు కల్వకుంట్ల కుటుంబం బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతొ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆంధ్ర నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.