Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాగతం పలికిన ఆటో, కారు, ట్రాలీ డ్రైవర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్లు
ర్యాలీకి కదిలొచ్చిన వందలాది కార్మికులు
రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి
కేరళలోలా ''సవారి'' తరహా యాప్ దేశవ్యాప్తం చేయాలి
రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వీరయ్య పి.శ్రీకాంత్
భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్, మరిపెడ, సూర్యాపేట, మిర్యాలగూడల్లో సీఐటీయూ సంఘర్ష జాత
నవతెలంగాణ-విలేకరులు
చట్టాలు, నిబంధనలు మారుస్తూ కేంద్రంలోని మోడీ, రాష్ట్రాల్లోని కేసీఆర్ ప్రభుత్వాలు రవాణా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వీరయ్య, పి.శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్ర రెండవ రోజైన బుధవారం భద్రాచలం, ఇల్లందు, మురిపెడ, మహబూబాబాద్, సూర్యాపేట, నేరేడుచర్ల, మిర్యాలగూడ పట్టణాల్లో సాగింది. యాత్ర బృందానికి ఆటో, ట్రాలీ, కారు, జీపు డ్రైవర్స్, లారీ ఓనర్స్, తదితర అసోసియేషన్లు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. బుధవారం ఉదయం భద్రాచలంలో ప్రారంభమైంది. ఉదయం జరిగిన సభకు వివిధ రంగాల కార్మికులు భారీగా హాజరయ్యారు. ఆ తర్వాత ఇల్లందు పట్టణంలోని డిగ్రీ కాలేజీ నుంచి కొత్త బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. అక్కడే సభ జరిపారు. అనంతరం మధ్యాహ్ననికి మహబూబాబాద్ జిల్లాకు యాత్ర చేరుకుంది. పట్టణంలో జ్యోతిబాసు నగర్ వద్ద ఆటోలు, ట్రాలీలు, కార్లు స్వాగతం పలికి అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం బస్టాండ్ వద్ద సభ నిర్వహించారు. కొద్దిసేపు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన కార్మికులు, కూలీలు, మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు. అక్కడ నుంచి మరిపెడ మండలానికి యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వరకు ఆటోలు, ట్రాలీలు, కార్లు, డ్రైవర్లు సంఘర్ష యాత్రకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. యాత్రకు కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కొత్తబస్టాండ్ సమీపంలో బహిరంగసభ నిర్వహించారు. అనంతరం నేరేడుచర్ల, మిర్యాలగూడకు యాత్ర కొనసాగింది. మిర్యాలగూడలో ఈదులగూడెం సుందరయ్య చౌరస్తా నుంచి రాజీవ్ చౌక్, బస్టాండ్ ఎదురుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగసభ నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.వీరయ్య, పి.శ్రీకాంత్ మాట్లాడారు. తెలంగాణలో 12 లక్షల మంది కార్మికులు రవాణా రంగంలో పనిచేస్తున్నారని, వారి గురించి ఏమాత్రం ప్రభుత్వానికి శ్రద్ధ ఉన్నా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఆర్టీసీని పరిరక్షించాలని, మోటార్ వాహన చట్టం 2019లో సవరణలు చేయాలని కేరళలో ''సవారి' పేరుతో ఏర్పాటుచేసిన సంక్షేమబోర్డు రవాణారంగ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతోందని, అదే తరహా బోర్డును మన రాష్ట్రంలోనూ ఏర్పాటుచేయాలని తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మోటార్ వెహికల్ యాక్ట్ తీసుకొచ్చిన సవరణల ద్వారా కార్మికులపై పెను భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పెనాల్టీలు, పనిష్మెంట్లను విపరీతంగా పెంచడం ద్వారా కార్మికులు తన సంపాదనలో సగానికి పైగా వీటికి పోతున్నాయన్నారు. వారు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు రవాణా రంగంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, ఆర్టీసీని మరింత బలోపేతం చేసి పరిరక్షించాలని, కార్మికులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆటో, టాటా మ్యాజిక్, జీప్, ట్రాలీలకు అడ్డాలు ఏర్పాటు చేయాలని, ఇబ్బడి ముబ్బడిగా వేస్తున్న పోలీస్ ఫైన్లు నియంత్రించాలని కోరారు. ఈ సమస్యల సాధన కోసం రాబోయే కాలంలో రవాణా రంగ కార్మికుల్ని ఐక్యం చేసేందుకే ఈ జాత రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 11 వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. జాతా అనంతరం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్టు చెప్పారు. యాత్రలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్, వివిధ జిల్లాల సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు, ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, జిల్లాల నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు.