Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ నియామక ప్రక్రియను పాత పద్దతులోనే చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెచ్చిన కొత్త నిబంధనల వల్ల కానిస్టేబుల్, ఎస్ఐ నియామకాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అభ్యర్థుల ఎత్తు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, రన్నింగ్ అర్హత ప్రమాణాలను మార్చడంతో చాలా మంది అభ్యర్థులు ఉద్యోగ అర్హత కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులకు గతంలో 800 మీటర్లు మాత్రమే రన్నింగ్ ఉండేదనీ, దాన్ని 1,600 మీటర్లకు పెంచారని పేర్కొన్నారు. మహిళలకు 100 మీటర్లు ఉన్న రన్నింగ్‌ను 800 మీటర్లకు పెంచారని తెలిపారు.
ఏపీతోపాటు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 3.80 మీటర్ల వరకు ఉన్న లాంగ్‌జంప్‌ను తెలంగాణలో పురుషులకు నాలుగు మీటర్లకు పెంచారని వివరించారు. ఇలాంటి విధానాలు ఆర్మీలో కూడా లేదని పేర్కొన్నారు. గతంలో ఐదు ఈవెంట్లు పెట్టి మూడింటిలో అర్హత పొందిన మెయిన్ పరీక్షకు అనుమతించేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మూడు ఈవెంట్లను మాత్రమే పెట్టి వాటన్నింటి లో అర్హత పొందాలనే కొత్త నిబంధన విధించారని తెలిపారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళలు 800 మీటర్లు రన్నింగ్ చేసిన తర్వాత కనీసం కొద్దిపాటి సమయం కూడా ఇవ్వకుండా మిగతా ఈవెంట్లను వెంటనే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. డిజిటల్ పద్ధతి ద్వారా ఎత్తు కొలవడంతో సాంకేతిక లోపం తలెత్తి చాలా మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతున్నారని వివరించారు. ప్రిలిమినరీ పరీక్షా ప్రశ్నాపత్రాల్లో కూడా దాదాపు 22 ప్రశ్నలు తప్పుగా ముద్రించారని తెలిపారు. మల్టిపుల్ ప్రశ్నలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యత వహించి ఏడు మార్కులు కలపాలంటూ హైకోర్టు తీర్పునిచ్చినా ఇప్పటికీ బోర్డుగాని, ప్రభుత్వం గాని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ 22 తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలిపితే సుమారు 50 వేల మంది అభ్యర్థులు అర్హత పొందే అవకాశముందని పేర్కొన్నారు. కానీ దీనిపై ప్రభుత్వం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. పాత నిబంధనల ప్రకారమే పోలీసు నియామ కాలను జరపాలనీ, ఈవెంట్లలో సడలింపు ఇవ్వాలనీ, అందుకోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు
- రన్నింగ్‌లో అర్హత పొందిన అభ్యర్థులందరినీ మెయిన్స్‌కు అవకాశం కల్పించాలి.
- లాంగ్‌జంప్‌ను నాలుగు మీటర్ల నుంచి 3.80 మీటర్లకు తగ్గించి, ఆన్ ద లైన్ జంప్‌ను అనుమతించాలి.
- షార్ట్‌పుట్‌ను ఆరు మీటర్ల నుంచి 5.60 మీటర్లకు తగ్గించాలి.
- డిజిటల్ విధానంలో కాకుండా, పాత పద్ధతిలోనే మ్యానువల్‌గా అభ్యర్ధుల ఎత్తు, కొలతలు తీసుకోవాలి
- రన్నింగ్ అనంతరం రెండు గంటలు లేదా ఒక రోజు సమయమిచ్చి మిగతా ఈవెంట్లను నిర్వహించాలి.
- ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ఈవెంట్ల నిర్వహించాలి.
- కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, సివిల్ విభాగాల్లో బెస్ట్ ఆఫ్ టూ ఈవెంట్లను అమలు చేయాలి.