Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి జీతంతో చెల్లింపు
సంస్థపై దుష్ప్రచారం నమ్మొద్దు
ప్రయివేటుతో పోటీ పడాల్సిందే...
ఉద్యోగుల సంక్షేమ మండలి రాష్ట్రస్థాయి సమావేశంలో ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ)ను మంజూరు చేస్తున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఈ డిఏ సొమ్ము చెల్లిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని టీఎస్ఆర్టీసీ కళాభవన్‌లో ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ మండలి రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అంతకుముందు ఆయన క్షేత్రస్థాయి సభ్యుల సూచనలు, సలహాలను విన్నారు. విధుల్లో తమకు ఎదురవుతున్న పలు సమస్యల్ని, పనిభారాన్ని వారు ఈ సందర్భంగా ఎమ్డీ దృష్టికి తీసుకొచ్చారు. వేతన సవరణ (పీఆర్సీ) గురించి అడిగారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ పీఆర్సీ తమ దృష్టిలో ఉన్నదనీ, సమయం వచ్చినప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిని భారంగా ఫీల్ అవ్వొద్దనీ, దాన్ని బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు. 2022లో ఉద్యోగుల కృషి వల్లే 70 శాతం నష్టాల్ని తగ్గించామన్నారు. కష్టపడే ఉద్యోగులను సంస్థ తప్పక గుర్తిస్తుందన్నారు. ఉద్యోగులను తగ్గించేందుకు మేనేజ్మెంట్ కుట్ర చేస్తున్నదనీ, ఉద్దేశ్యపూర్వకంగా అన్‌ఫిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే దుష్ప్రచారం తన దృష్టికి వచ్చింది. ఆ సమయంలో ఎంప్లాయీస్ వెల్ఫేర్‌బోర్డు సభ్యులు క్షేత్రస్థాయిలో ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి, ఆదర్శంగా నిలిచారన్నారు. సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు 10-12 గంటలు పనిచేస్తున్నారనీ, వారి సంక్షేమానికే తొలి ప్రాధాన్యత అనీ చెప్పారు. పోలీసు శాఖ కంటే ఎక్కువగాఆర్టీసీ కార్మికులే ఎక్కువగా కష్టపడుతున్నారని అన్నారు. సంస్థకు ఉద్యోగులు, ప్రయాణీకులు రెండు కండ్లు వంటి వారనీ, సంస్థ స్వయం సమృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. ఇప్పటికే ఐదు డిఏలు, ఇన్సెంటివ్స్ ఇచ్చామనీ, జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పైగా పెరిగిందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు విధులు నిర్వహణలో సామాజిక బాధ్యతలో భాగంగా 300 మంది ప్రాణాలను కాపాడారని ప్రసంసించారు. ఎక్స్ట్రా మైల్ సాధిస్తూ, మంచి పేరు సాధిస్తున్న ఉద్యోగులే ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. ప్రయివేటు రంగం నుంచి ఆర్టీసీకి విపరీతమైన పోటీ ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ప్రయాణికులకు స్మార్ట్ కార్డు సదుపాయాన్ని కల్పిస్తామనీ, దీని ద్వారా ఎక్కువగా ప్రయాణించే వారికి లాయల్టీ పాయింట్లను మంజూరు చేస్తామని వివరించారు. అనంతరం ఉద్యోగుల సంక్షేమ మండలిలో ఉత్తమ పనితీరు కనపరిచిన సభ్యులను శాలువాలు కప్పి, ప్రసంసాపత్రాలు ఇచ్చి సన్మానించారు. 3 జోన్ల నుంచి రీజియన్స్‌కు ఇద్దరి చొప్పున మొత్తం 22 మంది సభ్యులను ఎంపిక చేశారు. విధుల్లో సామాజిక బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగులు, ఎక్స్ట్రా మైలేజ్ సాధించిన డ్రైవర్లు, మెకానిక్‌లను సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, యాదగిరి, చీఫ్ పర్సనల్ మేనేజర్ కష్ణకాంత్, సి.ఎం (ఎఫ్అండ్ఎం) పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు.