Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి
- పరుగుపందెంలో అర్హత సాధిస్తే మెయిన్స్‌కు అనుమతివ్వాలి
- ఏడు మార్కులు కలపాల్సిందే
- దశలవారీగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. పరుగుపందెంలో అర్హత సాధించిన ప్రతిఒక్కరికీ మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏడు మార్కులు కలపాల్సిందేనని పట్టుబట్టారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ మార్కులివ్వాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి(ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, జనసమితి విద్యార్థి విభాగం, తెలుగు యువత, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీఎన్ఎస్ఎఫ్ యువజన,విద్యార్థి సంఘాలు) ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు మాట్లాడుతూ..కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు ఘోషిస్తుంటే నియామక పరీక్షలకు సంబంధించిన నిబంధనలను సడలించాల్సిందిపోయి టీఎస్ఎల్పీఆర్బీ మరింత కఠినతరం చేయడం దారుణమన్నారు. పోలీసులకు ఇప్పుడున్న ఈవెంట్లు పెడితే ఎంత మంది ఉరుకగలుగుతారు? అని ప్రశ్నించారు. ఇప్పటికే కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ ప్రస్తుతం ఎస్ఐ పోస్టు కోసం పోటీపడుతూ ఈవెంట్స్‌లో ఫెయిల్ అయిన వారు కోకొల్లలు ఉన్నారని చెప్పారు. ట్రైనింగ్ పొందిన వారే ఉరకలేనప్పుడు కొత్తగా పరీక్షలు రాసేవారు ఎలా ఉరుకగలుగుతారని టీఎస్ఎల్పీఆర్బీని ప్రశ్నించారు.
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్. కోదండరామ్ మాట్లాడుతూ..అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న టీఎస్ఎల్పీఆర్బీ చర్యలను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆర్మీ రిక్రూట్మెంట్లో కూడా ఇంత కఠినంగా ఈవెంట్స్ లేవని చెప్పారు. ప్రిలిమ్స్ పరీక్షలో నెగెటివ్ స్కోరింగ్లోనూ 120, 111 మార్కులొచ్చిన మెరిట్ విద్యార్థులు కూడా చిన్నచిన్న కారణాల వల్ల మెయిన్స్‌కు దూరంకావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ టెస్ట్లోని ప్రమాణాలు చాలా కఠినంగా, అశాస్త్రీయంగా ఉన్నాయనీ, వాటిని వెంటనే సవరించి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేష్ మాట్లాడుతూ..టీఎస్ఎల్పీఆర్బీ బోర్డ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలంటూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. దాన్ని అమలు చేయని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్‌ను బేేషరుతుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ...నోటిఫికేషన్లు విడుదల చేసి అనేక కొర్రీలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నదనీ, ఎన్నికల జిమ్మిక్కుల భాగంగానే నిరుద్యోగులతో కేసీఆర్ ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విమలక్క మాట్లాడుతూ..కనీసం తాగేనీళ్లను కూడా అందుబాటులో ఉంచకుండా, రన్నింగ్ అయిపోగానే వెంటనే లాంగ్‌జంప్ నిర్వహించడం దారుణమన్నారు. రన్నింగ్ విభాగంలో పాసైన అభ్యర్థులందరికీ మెయిన్స్ పరీక్షకు అనుమతివ్వాలని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. డి. సుధాకర్ మాట్లాడుతూ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పోలీసు రిక్రూట్మెంట్లో అసువులు బాసిన అభ్యర్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వలీ ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర(ఏఐవైఎఫ్)...కోట రమేష్, వెంకటేష్(ఢవైీఎఫ్ఐ), సలీం పాషా(యువజన జన సమితి), రెహ్మాన్,లక్ష్మణ్,ఉదరు(ఏఐఎస్ఎఫ్), అశోక్‌రెడ్డి, లెనిన్(ఎస్ఎఫ్ఐ) విజరు(పీడీఎస్‌యూ-విజృంభణ), విజరు...శివానంద్, అమరేందర్, (టీఎన్ఎస్ఎఫ్), భీమ్ రావు, శ్రీకాంత్(నిరుద్యోగ జాక్), నవీన్‌తో పాటు నాగరాజు(టఫ్), మహేశ్(పీడీఎస్‌యూ), అరుణ (బీఎస్పీ), జర్నలిస్టు విఠల్, అశోక అకాడమి ఫౌండర్ అశోక్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించని వందలాది మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
నేడు దున్నపోతులకు వినతులు
9న చలో హైదరాబాద్ : జేఏసీ ప్రకటన
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్‌లలో దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రమాణాలు నిర్ధారించడంపై రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా దున్నపోతులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు ఎస్ఐ, కాని స్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. తొమ్మిదో తేదీన చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించేదాకా దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఏడో తేదీన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. రన్నింగ్ అర్హత సాధించి లాంగ్ జంప్‌లో అనర్హులైన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులందరూ తొమ్మిదో తేదీన చలో హైదరాబాద్‌కు తరలిరావాలని పిలుపునిచ్చింది.