Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్‌పై కొందరు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు చేసిన దౌర్జన్యాన్ని, అరచకాన్ని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. వారు పాఠశాలల్లోకి చొరబడి ఉపాధ్యాయులపైనా దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. గణేష్ చందా ఇవ్వలేదనే కోపంతో ఆ ఉపాధ్యాయుడు మల్లికార్జున్ పిల్లలకు దేవుడు లేడంటూ పాఠం చెబుతున్నాడనీ, సరస్వతీదేవిని నిందించాడనీ, అభూత కల్పనలు సృష్టించి బడిలో ఆందోళన చేపట్టారని వివరించారు. ఆ ఉపాధ్యాయుడిని ఊరేగింపుగా గుడికి తీసుకెళ్లి అతని అభీష్టానికి వ్యతిరేకంగా బొట్టుపెట్టి క్షమాపణ చెప్పించి అవమానించారని పేర్కొన్నారు. ఇటువంటి అనాగరిక చర్యను పోలీసులు అడ్డుకోకపోగా అరాచక శక్తులకు కొమ్ముకాశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులను అణచివేయాలని డిమాండ్ చేశారు.
గుగులోత్ సూర్యపై మతోన్మాదుల దాడికి ఖండన
ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ సూర్యపై మతోన్మాదులు దాడి చేయడాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో పోస్టు ఆధారంగా తీవ్ర పదజాలం వాడుతూ సూర్యపై మతోన్మాద గూండాలు దాడి చేశారని తెలిపారు. దాడి జరిగిందంటూ కేసు పెడితే సూర్యపైనే పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. హక్కులను కాపాడాల్సిన పోలీసులు న్యాయం కోసం వచ్చిన వారిపై నిర్బంధం ప్రయోగించడం సరైంది కాదని తెలిపారు. ఆ పోలీసులపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.