Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ డీజీపీతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే భల్లా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : త్వరలో జరగనున్న ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల బందోబస్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి సాయుధ పోలీసు బలగాలు వెళ్లనున్నాయి. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే భల్లా వీడియో కాన్ఫరెన్స్లో గురువారం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్తో మాట్లాడారు. త్వరలోనే నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల బందోబస్తు కోసం వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర హోంశాఖ సాయుధ పోలీసు బలగాలను సమీకరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి భల్లా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఏ మేరకు సాయుధ పోలీసు బలగాలను బందోబస్తు నిమిత్తం పంపించగలరనే విషయమై రాష్ట్ర డీజీపీని అడిగి తెలుసుకున్నారు. తమకు చెందిన టీఎస్ఎస్పీ బెటాలియన్స్ నుంచి అవసరమైన సాయుధ బలగాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని డీజీపీ అంజనీకుమార్.. భల్లాకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీఎస్ఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అభిలాష బిస్త్ కూడా పాల్గొన్నారు.