Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో జోన్ పరిధిలో మూడు నుంచి నాలుగు జిల్లాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర పోలీసు శాఖ పనితీరును మరింత మెరుగుపర్చడానికి, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణను పెంచడానికి రాష్ట్రంలో ఏడు కొత్త పోలీసు జోన్లను ఏర్పాటు చేశారు. ఇది వరకున్న పాత జోన్లను రద్దు చేసి కొత్త పోలీసు జోన్లకు పోలీసు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో మూడు ప్రధాన కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలను వదిలి మిగతా జిల్లాలను కలిపి ఏడు పోలీసు జోన్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ను జోన్-1 గా, బాసర ను జోన్-2గా, రాజన్న సిరిసిల్లను జోన్-3గా, భద్రాద్రిని జోన్-4గా, యాదాద్రిని జోన్-5గా, చార్మినార్‌ను జోన్-6గా, జోగులాంబ గద్వాలను జోన్-7 గా నియమించారు. అలాగే, రామగుండం, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట కమిషనరేట్లను పోలీసు సర్వీసుల వ్యవహారంల విషయంలో ఈ జోన్ల పరిధిలోకి చేర్చారు. అలాగే, ఒక్కో జోన్‌ను డీఐజీ స్థాయి అధికారి కింద అప్‌గ్రేడ్ చేశారు.
తాజాగా ఈ కొత్త జోన్లలో యాదాద్రి జోన్‌కు రెమా రాజేశ్వరిని, రాజన్న సిరిసిల్ల జోన్‌కు రమేశ్ నాయుడును, గద్వాల జోగులాంబ జోన్‌కు ఎల్ఎస్ చౌహాన్లను డీఐజీలుగా నియమించారు. మిగతా జోన్లకు డీఐజీలను నియమించాల్సి ఉన్నది. కాగా, 1,2,3,4 జోన్లను మల్టిపుల్జోన్ ఐజీ షానావాజ్ ఖాసీం పరిధిలోకి, 5, 6, 7 జోన్లను ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్తగా ఏర్పడ్డ జోన్ల డీఐజీలు మల్టిపుల్ జోన్ల ఐజీలతో ఒకట్రెండ్రోజుల్లో డీజీపీ సమావేశమై వారికి పాలనాపరమైన దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది.