Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కుట్రల్ని పరిగణనలోకి తీసుకోవాలి
- హైకోర్టులో ప్రభుత్వ అప్పీల్‌పై వాదనలు
నవతెలంగాణ -హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తును రద్దు చేసి, సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర సర్కార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి, సిట్ కేసులో నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో సీఎం కేసీఆర్ ప్రతివాదిగా లేనప్పుడు ఆయన మీడియా సమావేశంలో వీడియోలను లీక్ చేయడాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించడాన్ని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ధవే ఆక్షేపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయడంపై సిట్ చేస్తున్న దర్యాప్తును రద్దు చేసి, సీబీఐకి బదిలీ చేయడం అన్యాయమన్నారు. ఆ దర్యాప్తు కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సీఎం విలేకరుల సమావేశంలో కొత్తగా చెప్పిందేమీ లేదనీ, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాటి గురించి, అప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మీడియాకు చెప్పిన అంశాల గురించే మాట్లాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలన్న కుట్ర జరుగుతోందనీ, ఆ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆ పార్టీ ఎర వేసిందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సీఎం మీడియా ద్వారా వాస్తవాలు చెబితే తప్పుకాబోదనీ, దీన్ని సాకుగా చూపి కేసు దర్యాప్తును ప్రభావితం చేయడం కాదన్నారు. దర్యాప్తు చేసే పోలీసు అధికారులు ఎవరైనా మీడియాకు చెబితే కోర్టు సందహాలను వ్యక్తం చేయడం అర్ధవంతంగా ఉంటుందని తెలిపారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన 12 గంటల్లోపే దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ బీజేపీ పిటిషన్ దాఖలు చేయడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తీసుకోలేదన్నారు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసి సిట్ దర్యాప్తు కొనసాగేలా చేయాలనీ, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించారు. ఆరోపణలు ఎదుర్కొనే నిందితులు తమను సిట్ విచారణ చేయరాదంటూ కోరే హక్కు ఉండబోదనీ, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ఎవరు చేయాలనే విషయాన్ని ఏకేసులోని నిందితుడూ కోరేందుకు హక్కు ఉండబోదన్నారు. ఇక్కడి కేసులో నిందితులు కోరిన మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం చెల్లదన్నారు. రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ, కోట్ల రూపాయలు ఇస్తామని ఆశచూపిన నిందితులు కోరిన విధంగా సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు వెలువడ్డాయనీ, బీజేపీలో చేరకపోతే సీబీఐ, ఈడీ వంటి కేసుల్ని ఎదుర్కొవాల్సి వస్తుందంటూ నిందితులు భయపెట్టినట్టే ఈడీ అధికారులు రోహిత్‌రెడ్డిని ఈ కేసులోనే విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నదని తెలిపారు. ప్రతివాదుల (నిందితులు) తరఫున న్యాయవాది డివి సీతారామ్మూర్తి వాదిస్తూ, నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాదన్నారు కాబట్టి.. అప్పీల్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నలుగురిలో ఒక్కరే టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని, మిగిలిన ముగ్గురూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారని గుర్తుచేశారు. పార్టీ పిరాయింపులకు పాల్పడిన వారు బీజేపీలో చేరాలనే ప్రతిపాదన వస్తే ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. అనంతరం కోర్టు వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది.
అనుమతి లేకుండా పత్రాలు జారీ చేయొద్దు..
జిల్లా సహకార అధికారి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలను జారీ చేయొద్దని చిత్రపురి కాలనీ మేనేజింగ్ కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కాలనీలో జరుగుతున్న పలు అక్రమాలపై రమేశ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిటీపై చర్యలు తీసుకునేలా కో-ఆపరేటీవ్ విభాగం ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు. ఐదుగురు సభ్యుల కమిటీ కేటాయింపులకు విరుద్ధంగా తిరిగి ఎలాంటి కేటాయింపులు చేయొద్దని ఆదేశించారు. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా సభ్యుల ఇళ్లు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని సూచించారు.