Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం ముసుగులో చెలరేగిపోతున్న వారిని అణిచివేయాలి : యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌పై కొందరు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన దౌర్జన్యాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలనీ, ఆ ఉపాధ్యాయు నికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, యూ పోచయ్య, డి సైదులు, సయ్యద్ షౌకత్ అలీ, పి రాజయ్య, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి, జాదవ్ వెంకట్రావు, జాడి రాజన్న, దూడ రాజనర్సుబాబు, మేడి చరణ్ దాస్, ఎస్ హరికిషన్, వి శ్రీను నాయక్, కె బిక్షపతి, వై విజయకుమార్, శాగ కైలాసం, సిహెచ్ రమేష్, బి కొండయ్య, ఎస్ మహేష్, మహమ్మద్ మసూద్ అహ్మద్, టి విజయసాగర్, సుధాకర్ రెడ్డి, కె రామారావు, ఎం రామారావు, ఎ గంగాధర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మతం ముసుగు లో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పేట్రేగి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారు పాఠశాలల్లోకి చొరబడి ఉపాధ్యాయులపైనా దాడులకు తెగబడు తున్నందున స్వేచ్ఛగా పాఠాలు చెప్పగలిగే వాతావరణం లేకుండా పోతున్న దని ఆవేదన వ్యక్తంచేశారు. గణేష్ చందా ఇవ్వలేదనే కోపంతో ఉపాధ్యాయు డు మల్లికార్జున్ పిల్లలకు దేవుడు లేడంటూ పాఠం చెబుతున్నాడనీ, సరస్వతీదేవిని నిందించాడనీ, అభూత కల్పనలు సృష్టించి బడిలో ఆందోళన చేపట్టారని వివరించారు. ఆ ఉపాధ్యాయుడిని ఊరేగింపుగా గుడికి తీసుకెళ్లి అతని అభీష్టానికి వ్యతిరేకంగా బొట్టుపెట్టి క్షమాపణ చెప్పించటం ద్వారా అతన్ని తీవ్రంగా అవమానించారని తెలిపారు. ఇలాంటి అనాగరిక చర్యను పోలీసులు అడ్డుకోకపోగా అరాచక శక్తులకు వత్తాసు పలకటం విచార కరమని విమర్శించారు. ప్రజాస్వామ్య వాదులు, సామాజిక వాదులు ఇలాం టివి అడ్డుకొకపోతే రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయు లను పాఠాలు చెప్పనివ్వబోరని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 51 (ఏ) ఆర్టికల్ ద్వారా సంక్రమించిన శాస్త్రీయ దృక్పథం గురించి పాఠ్యాం శాల్లో బోధించాలంటేనే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ, పరమత సహనం, శాస్త్రీయ భావజాలం, మూఢనమ్మకాలు తదితర అంశా లపై విద్యార్థులకు అవగాహన కల్పించే అవకాశం లేకుండా పోతున్నదని తెలిపారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచక శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచి వేయాలనీ, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
మల్లిఖార్జున్‌పై దాడికి పీఆర్టీయూటీఎస్ ఖండన
నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయుడు మల్లిఖార్జున్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న వ్యక్తిపై చట్టాన్ని గౌరవించకుండా దురుసుగా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు.