Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధం, హింసలేని సమాజం ఏర్పడాలి: ఏఐపీఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యులు రఘుపాల్
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా పేట్రేగిపోతున్న సామ్రాజ్యవాద దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని, యుద్ధం.. హింస లేని సమాజం ద్వారానే మానవాళి మనుగడ ప్రశాంతంగా కొనసాగుతుందని ఏఐపీఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యులు రఘుపాల్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఏఐపీఎస్ఓ రెండో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచశాంతి వర్ధిల్లాలి అంటే విద్యార్థులు కీలకమైన భూమిక పోషించాలన్నారు. శాంతి అనేది ప్రపంచ సమస్య.. శాంతి సమాజం ఏర్పడితేనే మానవాళి మనుగడ కొనసాగుతుందన్నారు. సామ్రాజ్యవాద, పెత్తందారితనానికి వ్యతిరేకంగా విప్లవాత్మక పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. మనదేశంలో గాంధీ, నెహ్రూ, వల్లభారు పటేల్ వంటి నాయకులు పనిచేశారనీ గుర్తుచేశారు. ఇప్పుడు మత ఛాందస వాద ప్రమాదగంటికలు మోగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నిరోధకులు చతుర్వర్ణ వ్యవ స్థకు బీజాలు వేస్తున్నారని చెప్పారు. మత రాజ్యం కోసం తపన పడుతున్నారని, దీనిని కట్టడి చేయకపోతే శాంతి నశించి హింస ఉన్మాదం చెలరేగే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో మతాన్ని బలవంతంగా మనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చీకటి ఏర్పడిందని, దశాబ్దాలు గడిచినా వాటి ఆనవాళ్లు పోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, పౌరసత్వ బిల్లు, కార్మిక కోడ్లు అప్రజాస్వామికమన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల నరసింహ, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.