Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అశోకా అకాడమి అధినేత అశోక్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయనతో పాటు 15 మందిని అరెస్టు చేసి గోషామహల్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి(ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, జనసమితి విద్యార్థి విభాగం, తెలుగు యువత, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీఎన్ఎస్ఎఫ్ యువజన,విద్యార్థి సంఘాలు) సదస్సును శుక్రవారం నిర్వహించింది. దీనికి జిల్లాల నుంచి వందలాది మంది అభ్యర్థులు తరలొచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే సభావేదిక నుంచి అశోక్ మాట్లాడుతూ..ఆమరణనిరాహార దీక్షకు కూర్చున్న నాగరాజుకు మద్దతుగా తానూ దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. అన్ని పార్టీల వాళ్లు ప్రెస్‌క్లబ్‌కు రావాలని పిలుపునిచ్చారు. ఆయనకు జిల్లాల నుంచి కొందరు అభ్యర్థులు మద్దతుగా కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. హాల్‌ను 5 గంటల వరకే బుక్ చేసుకున్నారనీ, వెళ్లిపోవాలని ప్రెస్‌క్లబ్ నిర్వాహకులు సూచించారు. ఇలా చేయడం సరిగాదని కోరారు. అయినా, వారు వినలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని పట్టుబట్టారు. ఇది సరైన సమయం కాదని జేఏసీ నేతలు సూచించినా ఆందోళనకారులు పట్టువీడలేదు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు మీటర్ల హైజంప్ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. 200 మార్కుల పరీక్షలో 20 పరీక్షలు తప్పులివ్వడమేంటని నిలదీశారు. చిన్నచిన్న కారణాలతో ఈవెంట్స్ నుంచి డిస్క్వాలిఫై చేస్తున్న టీఎస్ఎల్పీఆర్బీ.. తప్పుడు ప్రశ్నపత్రం తయారు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఏండ్ల తరబడి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతున్నదని ప్రశ్నించారు. అక్కడ నుంచి కదిలేదే లేదని ప్రకటించారు. ఏడు గంటల వరకు నచ్చజెప్పి చూసిన పోలీసులు చివరకు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే 15 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులను కూడా అరెస్టు చేసి గోషామహల్, పంజాగుట్ట పీఎస్‌లకు తరలించారు.