Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాలు రూ.26 వేలివ్వాలి
- ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలి
- సంగారెడ్డి మిషన్ భగీరథ ఎస్ఈ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించకపోతే మిషన్ భగీరథ పంప్ హౌస్ల్ని బంద్ చేసి ఇంటింటికీ నీటి సరఫరాను నిలిపేస్తామని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.సాయిలు హెచ్చరించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఎస్ఈ ఆఫీస్ ఎదుట మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 7 కాంట్రాక్టు సంస్థల పరిధిలో 8 వేల మంది మిషన్ భగీరథ కార్మికులు పని చేస్తున్నారన్నారు. వీరందరికీ ఒక్కో కాంట్రాక్టర్ ఒక్కో రకంగా వేతనాలిస్తూ దోపిడి చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.14,400 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.7500 నుంచి రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. ఎవరెస్ట్, కేఎన్ఎల్ వంటి సంస్థలు ఐదారు నెలలుగా వేతనాలివ్వకుండా కార్మికులు ఆకలితో అలమటించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం సక్సెస్ అవ్వడంలో కార్మికుల పాత్రే కీలకంగా ఉందన్నారు. రాత్రింబవళ్లూ పనిచేస్తున్న కార్మికులకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలూ లేవని తెలిపారు. కార్మికులకు గుర్తింపు కోసం ఐడీ కార్డులూ ఇవ్వట్లేదన్నారు. రాత్రి వేళల్లో పంపుల వద్ద పనిచేస్తున్న కార్మికులు పాము కాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో నీటి సరఫరా పనులు చేసే సయమంలో రక్షణ నిమిత్తం టార్చ్‌లైట్, వర్షాల్లో పనిచేసే వేళ జర్కిన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం గురించి గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆ పథకం బాగా నడవడానికి కష్టపడుతున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ అధికారులు.. కాంట్రాక్టర్లు, యూనియన్లతో జాయింట్ మీటింగ్ జరిపి పెండింగ్ వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఐడీ కార్డుల్ని ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల మంది మిషన్ భగీరథ కార్మికులు నీటి సరఫరా పనుల్ని ఆపేసి సమరశీల ఉద్యమాలకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు యాదగిరి, మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.సుధాకర్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాములు, కోశాధికారి కృష్ణ, ఉపాధ్యక్షులు రాములు, వెంకటేశం, ప్రభాకర్, నాయకులు అనిల్, రవి పాల్గొన్నారు.