Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత సమాజంలో తొలి నుంచి పరమత సహనం
- ఆనాటి నాయకత్వం సెక్యులరిజం ప్రాముఖ్యతను అవసరాన్ని నొక్కి చెప్పలేదు
- రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తెంపేసేందుకు నేడు కుట్రలు
- వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : 'రాజ్యం...మతం...కోర్టులు...హక్కులు' పుస్తకావిష్కరణ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైవిధ్యమైన ప్రపంచ మనుగడకు లౌకికవాదం తప్పనిసరి అని పలువురు వక్తలు హితవు పలికారు. సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేశ్ వ్యాసాల సంకలనం -'రాజ్యం...మతం...కోర్టులు...హక్కులు' వీటిపై ఓ జర్నలిస్టు దృక్కోణం అనే పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పుస్తకాన్ని ఆవిష్కరించిన ఐపీఎస్ అధికారి ఏ.బీ.వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ యూరోపియన్, పశ్చిమ దేశాల్లో క్యాథలిక్కులు, ప్రొటెస్టంట్ల ఘర్షణల నేపథ్యంలో లౌకికవాద భావన ఆవశ్యకతను ఆయా దేశాలు గుర్తించాయని తెలిపారు. భారతదేశానికి బ్రిటీషర్ల రాకతో పాటు ఆ భావన కూడా వచ్చిందని చెప్పారు. అంతకు ముందు దేశంలో రాజ్యం-మతం పెనవేసుకునే ఉన్నాయనీ, అయితే మతమెప్పుడు సమాజానికి చిక్కులు తేలేదని గుర్తుచేశారు. దండయాత్రలు, మతమార్పిడులు మొదలయ్యాక అందరూ కలిసి బతకాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. హిందూ-ముస్లిం రాజుల మధ్య అధికార మార్పిడి కోసం జరిగిన యుద్ధాలే తప్ప, మతాల వారీగా యుద్ధాలు జరిగిన చరిత్ర లేదని స్పష్టం చేశారు. భారత సమాజంలో మొదట్నుంచి సహనముందని తెలిపారు. మత సామరస్యాన్ని, మత ఉద్రిక్తతలను తగ్గించడానికి జాతీయ నాయకత్వం సంతృప్తికరంగా పని చేయలేదన్నారు.
మత, కుల, ఆర్థిక సమస్యల కన్నా స్వాతంత్య్ర సముపార్జనపైనే ఎక్కువగా దృష్టి సారించారని వివరించారు. అసంపూర్ణంగా, ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన ఆ సమస్యలు 1947 తర్వాత కూడా సమాజాన్ని వెంటాడుతునే ఉన్నాయన్నారు. స్వాతంత్య్రం తర్వాత సాంఘిక సంస్కరణలు బుద్ధిజీవుల నుంచి రాజ్యం చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు. ఆ రాజ్యం అప్పటికే అర్థాకాలి, నిరక్షరాస్యతతో ఉన్న ప్రజల గొంతుల్లోకి సెక్యులరిజం జొప్పించారే తప్ప దాని ఆవసరాన్ని మాత్రం నొక్కి చెప్పలేదని విమర్శించారు. దీనికి తోడు ఓటు బ్యాంకు రాజకీయాలు, కొద్ది మందిని సంతృప్తి పరిచే రాజకీయాలు సెక్యులరిజంపై సమాజంలో అనుమానాలు పెరగడానికి కారణాలయ్యాయని విశ్లేషించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న మరి కొన్ని పార్టీలు సెక్యులరిజాన్ని ఒక బూతు మాటగా, సూడో సెక్యులరిజంగా సమాజంలోకి తీసుకెళ్లగలిగాయని తెలిపారు. లౌకికవాదం లేకుంటే పలు భాషలు, కులాలు, మతాలు కలిగిన భారత్ ఒక దేశంగా మనగలిగేదే కాదని అభిప్రాయపడ్డారు. హిందూ మతం వ్యవస్థీకృతమైంది కాదనీ, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో ఆ మతాన్ని ఆచరిస్తున్నారని వివరించారు. ఇస్లాం, క్రిస్టియానిటీలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయని తెలిపారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా ఉంటే తప్పని చెప్పిన వారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలైతే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారతదేశం రెండు దేశాలైతే తప్పేంటని ప్రశ్నించేందుకు ఎంతో కాలం పట్టదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశ మనుగడకు, సెక్యులరిజం పరిరక్షణకు భావి విప్లవం రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రజల ఆలోచనల్ని సురేశ్ వ్యాస సంకలనాలు వికసింపజేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావు పుస్తకాన్ని సమీక్షిస్తూ, సురేశ్ మరకలేని అద్దంలో సమాజాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. తిరుగుబాటు కోసం ఆలోచించేందుకు వీలుగా వ్యాసాలు రాశారన్నారు. సమాజాన్ని గమనిస్తూ, స్పందిస్తూ, మతాన్ని, రాజ్యాన్ని ప్రశ్నించేందుకు ఈ వ్యాసాలు మేల్కొలుపుగా ఉపయోగపడతాయని కితాబిచ్చారు. ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టుల్లో చాలమంది న్యాయవ్యవస్థ జోలికి వెళ్లేందుకు ఇష్టపడరనీ, అయితే సురేశ్ న్యాయవ్యవస్థపై విమర్శలు చేసేందుకు వెనుకాడలేదని ప్రశంసించారు. రాజ్యాంగానికి మౌలిక నిర్మాణం ఉన్నట్టే సమాజానికి ఉంటుందనీ, ఆ నిర్మాణాన్ని నిలుపుతున్న తాడును తెంపే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే సమాజం ఎంతటి ప్రమాదంలో పడుతుందని సురేశ్ హెచ్చరించారని తెలిపారు. సురేశ్ వ్యాపాల సంకలనాలనేవి ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకమని సూచించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజ ప్రయోజనం కోరుకునే వారందరు ఆహ్వానించి, ఆస్వాదిస్తూ, ఆనందించే పుస్తకం ఇదని తెలిపారు. ప్రజలను శత్రువుగా భావించే పాలకులతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని హెచ్చరించారు. ఆలపాటి సురేశ్ మాట్లాడుతూ తెలియని మనిషిని ద్వేషించడం, ఆ ద్వేష భావన పెరుగుతున్నా మౌనం ఉండేలా సమాజాన్ని మానసిక వైకల్యం వైపు నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.