Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో బీజేపీ
- హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి
- ఎన్నికలప్పుడే పొత్తుపై ఆలోచన :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- మిర్యాలగూడ
తాత్కాలిక ప్రయోజనాలు చూసి నాయకులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని.. వారి ప్రయోజనాలు కాకుండా ప్రజల భవిష్యత్తును చూసి అడుగులు వేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కొందరు పార్టీలు మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. నాయకులు తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. బీజేపీ ధన, జన బలమున్న నాయకులను ఆకర్షించి తమ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
బీజేపీ తమ తప్పులను కప్పిపుచ్చుకొని రాష్ట్రంలో మత విద్వేషాలు రగిల్చి బలపడాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో తనకు సంబంధం లేదని చెప్పుకున్న బీజేపీ.. ఆ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రయత్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నిక తర్వాత బీజేపీ కొంత స్పీడు తగ్గిందన్నారు. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 7న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు. మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడిందన్నారు. ఆ పార్టీని ఓడించేందుకే కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని చెప్పారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునే వారికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతనం రాష్ట్రానికి రావలసిన నదీ జలాల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చక నాన్చుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల బతుకు భారంగా మార్చిందని, వాటిని మరిపించేలా అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల రాష్ట్రం వినాశం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న ఈ రాష్ట్రంలో ద్వేష భావం పెంపొందించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. చివరకు చిన్న పిల్లల్లో కూడా విద్వేశాన్ని పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి ప్రమాదకరమైన రాజకీయం రావడం మంచిది కాదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాటి అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. పోడు భూముల రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నిబంధనలు ఉన్నాయని, పాత పద్ధతి ద్వారానే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పత్తికి మద్దతు అందేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి గురించి తాము ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని, ఎన్నికలప్పుడే ఆ విషయం మాట్లాడుతామన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ జగదీష్ తదితరులు ఉన్నారు.