Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు అవార్డులు : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పట్టణాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనీ, ఈ దిశగా నిబద్ధతతో కూడిన ప్రయత్నాన్ని ఎనిమిదేండ్లుగా కొనసాగిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, పురపాలికల మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన వర్క్‌షాప్‌ను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణాల అభివృద్ధిపై కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. పురపాలక శాఖ, దాని అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో హైదరబాద్ కాకుండా మిగతా పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎనిమిదేండ్లలో సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. పట్టణాల అభివృద్ధి కోసం ఇంత భారీగా నిధులను కేటాయించడం గొప్ప విషయమన్నారు. దేశంలో మరే రాష్ట్రం ఇంత పెద్దమొత్తంలో నిధులను కేటాయించలేదని స్పష్టం చేశారు. పరిపాలన సంస్కరణలు తీసుకొస్తూనే.. నూతన చట్టాలు, నిరంతరం నిధులు కేటాయిస్తూ పట్టణాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తమపై అత్యంత సులువుగా రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాల్సిన అనివార్యతలో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఉత్తమ గ్రామపంచాయతీలు, పట్టణాలు, జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయన్న సంగతిని తాజాగా కేంద్రం గుర్తించి.. ప్రకటించిందని తెలిపారు. జిల్లా ర్యాంకులతోనూ మరోసారి ఇది నిరూపితమైందన్నారు. పురపాలక పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరు కాదనలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను పరిశీలించి రావాలని సూచించారు. పురపాలక శాఖను దేశంలోనే అత్యుత్తమ శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉద్యోగులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వార్డుకొక పురపాలక అధికారిని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. పట్టణాలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు విప్లవాత్మకమైన మున్సిపల్ చట్టం, టీఎస్‌బీపాస్ వంటి చట్టాలను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. నిర్ణీత గడువులోగా భవనాలకు ఆన్ లైన్ లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో ఇంకేది లేదని చెప్పారు. టీఎస్ బి పాస్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని మినహాయించి దాదాపు 1,78,000 దరఖాస్తులకు పురపాలక శాఖ అనుమతులను ఇచ్చిందని తెలిపారు. ప్రతి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మిషన్ భగీరథ, వైకుంఠధామాల నిర్మాణం, గ్రీన్ బడ్జెట్ అమలు చేయడం, ఆధునాతన దోబీ ఘాట్ల ఏర్పాటు, డంపు యార్డుల బయోమైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్లు తయారీ, డిజిటల్ డోర్ నెంబర్ కేటాయింపు వంటి కీలకమైన అంశాలను రోజువారి ఎజెండాలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా ఆయా అంశాల్లో సమగ్రాభివృద్ధి జరిగేలా అధికారులు కషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 144 పురపాలక పట్టణాలు ఉంటే అందులో 42 ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హౌదా సాధించడం గొప్ప విషయమన్నారు. వ్యర్ధాల శుద్ధి నిర్వహణలో అంతిమంగా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఆచరణ వైపు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. వచ్చేనెల 24న పట్టణ ప్రగతి దినోత్సవ నిర్వహణ జరపాలనీ, ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు వివిధ కేటగిరీల వారీగా అవార్డుల ప్రదానం చేయనున్నట్టు మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.
పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలి
హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పనపై నగర పోలీస్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, సంబంధిత ఇతర శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలను అమలుచేయడంతోనే అనేక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలమని సూచించారు. నగరంలో అనేక చోట్ల కొత్తగా ఫ్లై ఓవర్లు, ఇతర రోడ్ల నిర్మాణాలు పూర్తైన నేపథ్యంలో వాటికి అనుబంధంగా ప్రస్తుతమున్న రహదారులపైన పుట్ పాత్ ల నిర్మాణాన్ని కొనసాగిస్తూ పాదాచారుల నడకకు మరింత అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వాహనాల సంఖ్య అనేక రెట్లు పెరిగిందని తెలిపారు.దీంతో రోడ్ల పైన భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుందనీ, ప్రజలకు అనువైన ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ఈ సవాల్ ని ఎదుర్కోగలమని చెప్పారు. తక్కువ దూరాలకు వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నడక లేదా సైకిల్ వంటి పద్ధతులను కొన్ని నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. పాదచారుల రక్షణ కోసం పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అందించాల్సిన సహకారంతో పాటు నగరంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్‌లు, నూతన ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. నగరంలో 60 జంక్షన్లను ఇప్పటికే జీహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తున్నదనీ, పాదాచారులే ప్రధాన కేంద్రంగా దాదాపు 12 జంక్షన్లలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్టు మంత్రి వివరించారు.