Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ అప్పులు
- పెద్దలకు దోచిపెట్టిన మోడీ ప్రభుత్వం
- తెలంగాణ నిధులతోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు
- ఎన్నికలప్పుడే రాజకీయాలు
- బీజేపీ ప్రమాదకరమైన పార్టీ.. దాని ఉచ్చులో పడొద్దు
- ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- మునుగోడు నియోజకవర్గం, హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ- హుజూర్నగర్ /చండూరు
ప్రతి పేదవాని గడపకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలతో తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం మంచి పనులు చేసిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు పట్టణంలో రూ. 40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా పలుచోట్ల కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు. తెలంగాణ ప్రజలు వివిధ పన్నుల రూపంలో ఎనిమిదేండ్లలో కట్టినవి రూ.3.6 లక్షల కోట్లు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ.1.68 వేల కోట్లు. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు.. ఈ విషయం తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దం' అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. తాను చెప్పింది తప్పని రుజువు చేయకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారని అనుకోను.. కనీసం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా? అని కిషన్‌రెడ్డిని అడుగుతున్నా అని కేటీఆర్ ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి తెలంగాణ పోరాటంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదని విమర్శించారు. నేడు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలు.. నిలదీస్తే ఒక్క సమాధానం కూడా చెప్పరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయి. ప్రజలు మాత్రం మరింత అగాధంలోకి వెళ్లారు. మోడీ వల్ల దేశం అప్పులపాలైంది.. దేశం అభాసుపాలైంది.. దేశానికి వేగు చుక్క తెలంగాణ మాత్రమే' అని అన్నారు.
'ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతాం.. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు.. ప్రజలు ఆశీర్వదించాలి.. అండగా ఉండాలి.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం..బీజేపీ ప్రమాదకర పార్టీ.. దాని ఉచ్చులో పడొద్దు.. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పని'' అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ నాయకులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నది బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల ఒక దళితుడిగానీ, గిరిజన వ్యక్తిగానీ బాగుపడిన దాఖలాలు లేవన్నారు.
గతంలో మునుగోడు ఎమ్మెల్యేగా పని చేసిన వారు నియోజకవర్గాన్ని అనాథను చేశారన్నారు. ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారని చెప్పారు. రాబోయే నాలుగైదు నెలల్లోనే అందమైన చండూరును పరిచయం చేస్తామని చెప్పారు.
పూర్వపు నల్లగొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలను మార్చే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నేతన్నకు ఇచ్చిన మాట ప్రకారం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ శంకుస్థాపన చేసినట్టు వెల్లడించారు. చేనేత క్లస్టర్ల వల్ల గట్టుప్పల్‌లో 460 మంది, తేరట్‌పల్లిలో 190 మంది లబ్దిదారులకు మేలు కలుగుతుందన్నారు. రూ.30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వపర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు రాష్ట్ర చైర్మెన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండిస్టీస్ చైర్మెన్ విజయసింహారెడ్డి, జెడ్పీచైర్మెన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, ఎంసిి.కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, రవీంద్ర నాయక్, కలెక్టర్ టి.వినరుకృష్ణారెడ్డి పాల్గొన్నారు.