Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులరైజేషన్కు ఫీజు చెల్లించాలంటూ నోటీసులు
- 90రోజుల్లో మూడువాయిదాలుగా చెల్లించాలంటూ ఆదేశాలు
- ఇప్పటికిప్పుడు పంపించినవి కాదు : కలెక్టర్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2, 2014కు ముందు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇండ్ల్లు నిర్మించుకున్న నిరుపేదలను ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం జీవోలు 58, 59 జారీ చేసిన విషయం విధితమే. దీనిలో 125 గజాలలోపు స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న దారిద్య్రరేఖ దిగువన ఉన్నవారి స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరణ చేసేందుకు జీవో నంబర్ 58 జారీ చేసింది. 125 గజాలకు పైగా ఇండ్ల స్థలం ఉన్న నిరుపేదల కోసం జీవో 59ని విడుదల చేసింది. అయితే జీవో 59 కింద అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తుదారులకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలో 2వేల మందికి పైగా ఈరకమైన దరఖాస్తులు చేసినట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఉన్నపళంగా వారు రూ.లక్షల్లో చెల్లించి స్థలం రెగ్యులరైజ్ చేసుకోవాల్సి రావడంతో నిరుపేదల్లో ఆందోళన నెలకొంది.
దిక్కుతోచని స్థితిలో జీవో 59 దరఖాస్తుదారులు..
తెలంగాణ ప్రభుత్వం 2015 జనవరిలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు తొలిసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎనిమిదేండ్లలో మూడు పర్యాయాలు వివిధ నెంబర్లతో జీవోలు వెలువడ్డాయి. 2015లో జీవో 12 రూపంలో ఒకసారి, 2017 ఫిబ్రవరిలో జీవో 35, డిసెంబర్లో 283 జీవో విడుదల చేసింది. చివరిసారిగా 2022లో జీవోఎంఎస్-14 పేరిట ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 58, 59 జీవోలు విడుదల చేసింది. దీనిలో 125 గజాలలోపు స్థలం కలిగి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఆక్రమణదారులకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని సూచిస్తూ జీవో నెంబర్ 58 జారీ చేసింది. అంతకుమించి ఉంటే ల్యాండ్ బేసిక్ వాల్యూ ఆధారంగా ఫీజు నిర్ణయిస్తూ జీవో నంబర్ 59 జారీ చేసింది. ఈ మేరకు అప్లికేషన్ చేసుకునేందుకు గతేడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు 50రోజుల పాటు గడువు ఇచ్చింది. రూ.1200 వరకు చెల్లించి జిల్లాలో 6వేల మంది వరకు జీవో 58 కింద దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4వేల మందికి పైగా సంబంధించిన క్రమబద్ధీకరణ పట్టాలు కూడా సిద్ధమయ్యాయి. 125 గజాలకు పైబడిన ఇండ్ల స్థలం ఉన్న నిరుపేదలు జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నారు. నిర్దేశించిన ఫీజు చెల్లించి వారు స్థల క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించిన నోటీసులు దరఖాస్తుదారులకు అందడంతో ఆందోళన నెలకొంది. మూడు నెలల కాలంలో నెలకో వాయిదా చొప్పున ఈ మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
59 జీవో ప్రకారం చెల్లింపులు ఇలా...
జీవో 58 కింద ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తారు. ఆ స్థలాలను వారసత్వంగా వినియోగించుకోవచ్చు కానీ అమ్ముకోవడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా 58 జీవో స్థలాల దరఖాస్తులు 85వేలకు పైగా వచ్చాయి. ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా విడుదల చేసిన జీవో 59 కింద మాత్రం 60వేల అప్లికేషన్లు రావడం గమనార్హం. ఇక జీవో 59 కింద క్రమబద్ధీకరించే స్థలాలకు మాత్రం బేసిక్ వాల్యూ ఆధారంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. జీవో 59 ప్రకారం చెల్లింపులను పరిశీలిస్తే...126 నుంచి 250 గజాల వరకు ఉంటే స్థలం బేసిక్ వాల్యూలో 50%, 251-500 గజాల వరకు బేసిక్ వాల్యూలో 75%, 500 గజాలకు పైగా ఉంటే బేసిక్ వాల్యూ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ గణాంకాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 2000 మందికి పైగా నిరుపేదలకు జీవో 59 కింద శుక్రవారం నోటీసులు జారీ అయ్యాయి. నెలకో వాయిదా చొప్పున మూడు వాయిదాల్లో మొత్తం ఫీజు చెల్లించాలని తెలపడంతో ఇప్పటికిప్పుడు డబ్బుల కోసం తంటాలు పడుతున్నారు.
కూలి చేసి బతికేటోణ్ని రూ.లక్షలు నేను యానుంచి తేను..
అంతోని రమేష్, ఎస్సీ, నరసింహాపురం, చింతకాని
నా ఇంటిస్థలం 178 గజాలు క్రమబద్ధీకరిస్తానంటే జీవో 59 కింద గతేడాది ఫిబ్రవరిలో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా. రోజూ కూలికి వెళ్తేనే నా కుటుంబం గడుస్తది. అటువంటి నాకు ఇప్పటికిప్పడు రూ.1,45,600 చెల్లించాలని కలెక్టర్ నోటీసులు పంపించారు. 90 రోజుల్లో మూడు వాయిదాల్లో చెల్లించాలన్నారు. తొలి రెండు వాయిదాల్లో రూ.50,960 చొప్పున, మూడో వాయిదా 43,680 చెల్లిస్తేనే మా ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరిస్తారట..! 'రెక్కాడితే గానీ డొక్కాడని' నేను ఇప్పటికిప్పుడు రూ.లక్షల డబ్బులు యానుంచి తేవాలి. నాకు సెంటు భూమి కూడా లేదు. 90 రోజుల్లో చెల్లించకపోతే నా పరిస్థితి ఏమి కావాలి? నాకుటుంబం రోడ్డున పడాల్సిందేనా?
క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాలి..
- వీపీ గౌతమ్, ఖమ్మం జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు 125 గజాలకు పైగా స్థలం ఉన్నవారు బేసిక్ వాల్యూ ఆధారంగా మూడు వాయిదాల్లో నిర్దేశిత ఫీజు చెల్లించాల్సిందే. కొన్ని రోజులుగా నోటీసులు పంపుతున్నాం. ఇప్పటికిప్పుడు పంపించినవేమీ కాదు. అందరూ సహకరించి ఇండ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేయించుకోవాలి.