Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
- రాష్ట్ర పరిధిలోని సమస్యలపైనా నిర్లక్ష్యం
- రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా రాష్ట్రంలోనూ శుక్రవారం ర్యాలీలు, ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని స్కీంల ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిధిలోని సమస్యలపైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి వినతిపత్రాలు అందజేశారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ సిబ్బంది, వివోఏలు తదితర విభాగాల్లో పని చేస్తున్న స్కీంవర్కర్లు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి.రమ మాట్లాడుతూ.. స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కీంల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలోని సమస్యలను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ.. స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. గోల్కొండ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఆశావర్కర్లు డిప్యూటీ తహసీల్దార్ ఫారూఖ్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్‌లో ధర్నా నిర్వహించి, కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్‌చౌక్ వద్ద నిరసన తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నవాబ్‌పేట మండలం గురుకుంటలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ఆధ్వర్యంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ముందు స్కీమ్ వర్కర్లు ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు, ఆశావర్కర్లు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం మండలంలో ఆశావర్కర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. నల్లగొండలో స్కీం వర్కర్లు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. త్రిపురారంలో వైద్యాధికారికి మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర నాయకులు ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. హాలియాలో ఆశావర్కర్లు వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మణుగూరులో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.