Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 రోజులు మార్చూరీలో యువకుడి శవం
- కుళ్లి కంపుకొట్టాక స్పందించిన పోలీసులు, ఆస్పత్రివర్గాలు
- 18న రోడ్డు ప్రమాదం.. 23న సంగారెడ్డి ఆస్పత్రిలో మృతి
- పట్టించుకోని పోలీసులు.. సమాచారమిచ్చి వదిలేసిన వైద్యులు
- రాజు ఆచూకీ కోసం వెతికిన భార్య, బంధువులు
- న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళన
- స్పందించిన మంత్రి.. ఆర్థిక సాయం, భార్యకు ఉద్యోగం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మృతదేహాన్ని మార్చూరీలో పడేసి వైద్యులు చేతులు దులుపుకున్నారు. సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యం ఫలితంగా మార్చూరీలోనే శవం కుళ్లిపోయిన సంఘటన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఝరాసంఘం మండలంలోని కిష్ణాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శ్రీను అలియాస్ చిన్న (28) టీవీ సీరియల్స్‌లో కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 18న హైదరాబాద్ నుంచి పల్సర్ బైక్‌పై (టీఎస్15ఈటీ4409) ఇంటికి వెళ్తున్నాడు. నాందేడ్ రహదారి సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు 108కు ఫోన్ చేయగా అతన్ని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తీవ్ర గాయాల పాలైన చిన్నాను వైద్యులు పరీక్షించి చికిత్స చేశారు. పరిస్థితి విషమించి డిసెంబర్ 23న మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానిక సంగారెడ్డి టౌన్ పోలీ సులకు ఆస్పత్రి వైద్యులు సమాచారమిచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని పట్టించుకోలేదు. ఆ తర్వాత పక్కనే ఉన్న పుల్కల్ మండల పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు సైతం పట్టించుకోలేదు. దాంతో శవాన్ని ఆస్పత్రిలోని మార్చూరీ ప్రీజర్‌లో ఉంచారు. 14 రోజులైనా ఎవరూ ఆ శవం గురించి రాలేదు. దాంతో శవం కుళ్లి, కంపు కొడుతుండటంతో ఆస్పత్రి సిబ్బంది గమనించి వైద్య అధికారులకు చెప్పారు. సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ ఈ నెల 5న మళ్లీ పుల్కల్ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసినా పోలీసులు ఆశ్రద్ధ వహించడంతో సూపరింటెండెంట్ కాస్త గట్టిగా చెప్పడంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అతని జేబులో ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లభించగా, ఝరాసంఘం మండలం కిష్ణాపూర్ గ్రామానికి చెందిన చిన్నగా గుర్తించారు. వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వగా గురువారం రాత్రి బంధువులు, భార్య ఆస్పత్రికి చేరు కున్నారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట రాత్రి ఆందోళన చేశారు. తన భర్త ఆచూకీ కోసం వెతుకు తున్నామని, అతను చనిపోయిన విషయం తమకు ఎవరూ చెప్పలేదని బోరున విలపించారు. అతని పోన్ కూడా స్విచ్ఆఫ్ అవడంతో బంధువులు, స్నేహితులు, తెలిసినవారిని అడిగామని తెలిపారు. ఈ నెల 2 స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇంతలోనే సంగారెడ్డి ఆస్పత్రిలో శవం ఉన్నట్టు సమాచారం వచ్చిందని భార్య సంగీత తెలిపారు. అయితే, భర్త ఇంటికి రాకుండా పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే అతని విషయం తెలిసేదని పోలీసులు తెలుపుతున్నారు.
ఆస్పత్రి సిబ్బంది, పోలీసుల తీరుకు నిరసనగా శుక్రవారమూ ఆస్పత్రి, పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి ఆందోళన చేశారు. పక్కనే ఉన్న జిల్లా పరిషత్ కార్యాల యంలో మంత్రి సమక్షంలో జరుగుతున్న జెడ్పీ మీటింగ్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జెడ్పీ సమావేశంలో పాల్గొన్న మంత్రి హారీశ్ రావు.. సంగారెడ్డి ఆస్పత్రిలో జరిగిన సంఘటన గురించి కలెక్టర్ ఎ.శరత్‌తో మాట్లాడారు. ఏం జరిగిందో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు స్పందించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సిందని ఆస్పత్రి అధికారులను మందలిం చారు. అనంతరం మృతుని బంధువులు, భార్యను కలెక్టరేట్ కు పిలుపించుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, చిన్న భార్య సంగీతకు ఉద్యోగం, సొంతూరులో డబుల్బెడ్రూమ్ ఇల్ల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.