Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ప్రారంభమంటూ ప్రకటనలు ఇవ్వడం సరైంది కాదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లను ప్రారంభించినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు విద్యాసంస్థల పీఆర్వోలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పుడే అడ్మిషన్లు ప్రారంభమంటూ పెద్ద పెద్ద హోర్డింగ్ల ద్వారా, ప్రచారం చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే ఆఫర్ అంటూ మాయ మాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.