Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఛాయిస్ ప్రశ్నలను పెంచాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రతిరోజూ పరీక్ష కాకుండా రోజు విడిచి రోజు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మానసిక ఒత్తిడికి దూరం చేసేలా ప్రశ్నాపత్రంలో 30 శాతం ఛాయిస్ ప్రశ్నలు పెంచాలని కోరారు. పేపర్ల సంఖ్యను ఆరుకు కుదించడం ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. ఆబెక్టివ్ ప్రశ్నలు రెండు మార్కులు, మూడు మార్కుల ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇచ్చిన సమయంలో అన్ని రాయాలంటూ చెప్పడం సరైంది కాదని తెలిపారు. ఈ పద్ధతి వల్ల సిలబస్ మొత్తం ఒకే పేపర్లో విద్యార్ధులు రాయాలనీ, సమయం సరిపోదని వివరించారు. దీంతో పరీక్ష కఠినంగా ఉంటుందనీ, విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విద్యార్ధులంతా కరోనా సమయంలో ఆన్లైన్లో సరిగ్గా డిజిటల్ విద్య అందుబాటులో లేని వారని వివరించారు. ఆ సమయంలో వారికి చదువుకోవడం ఇబ్బందికరంగా మారిందనీ, సరైన అభ్యాసన లేదని తెలిపారు. ఈ పరిస్థితి దృష్ట్యా కనీసం ఛాయిస్ లేకుండా చేస్తే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో ఛాయిస్ ఉందనీ, ఇంజినీరింగ్, మెడిసిన్లాంటి పరీక్షలు ఛాయిస్ ఇస్తున్నారని గుర్తు చేశారు. పదో తరగతికి ఈ నిబంధనను ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని ఎస్ఎస్సీ బోర్డు అధికారులను వారు డిమాండ్ చేశారు.