Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులకు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) సేకరణ బోనస్ (నెట్ రెవెన్యూ)ను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో కూలీలకు తునికాకు సేకరణ పెండింగ్ బోనస్ చెల్లింపులు, ఈ సీజన్లో తునికాకు సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 30 జిల్లాల పరిధిలోని 37 డివిజన్లలో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో సేకరించిన బీడీ ఆకులను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా సేకరిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఇరు రాష్ట్రాల నెట్ రెవెన్యూ వాటాలను తేల్చడం, కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో వివరాల సేకరణలో ఆలస్యం అయిందని చెప్పారు. తునికాకు కూలీల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ పూర్తయిందనీ, దాదాపు రూ. 233 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... కూలీలకు బోనస్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరగటం సరిగాదన్నారు.
వీలైనంత త్వరగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేసవిలో సుమారు 2.50 లక్షల మంది గిరిజన, గిరిజనేతర కూలీలకు ఆదాయం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడవిపై స్థానిక ప్రజలకే పూర్తి హక్కులున్నాయనీ, అటవీ సంపదపై వచ్చే ఆదాయంలో రాయల్టీ డబ్బులను చెల్లించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినరు కుమార్ పాల్గొన్నారు.