Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా గుర్తింపు రాని ప్రయివేటు కాలేజీలు 24
- దగ్గర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫీజు చెల్లించండి : ఇంటర్ బోర్డు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అనుబంధ గుర్తింపు రాని ప్రయివేటు జూనియర్ కాలేజీలు 24 వరకు ఉన్నట్టు సమాచారం. గుర్తింపు రాకపోవడంతో ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 'పరీక్షలు ఎలా రాయాలి, ఏ కాలేజీలో ఫీజు కట్టాలి, మా భవిష్యత్తు ఏంటీ?'అన్న ప్రశ్నలతో మనోవేదనకు గురవుతున్నారు. విశ్వభారతి జూనియర్ కాలేజీ, గ్లోరీ జూనియర్ కాలేజీ (షాహీన్ నగర్), ఉర్బేన్ జూనియర్ కాలేజీ (మాదాపూర్), గౌతమి జూనియర్ కాలేజీ (హయత్నగర్), నోయిసిస్ జూనియర్ కాలేజీ, శ్రీఅరబిందో జూనియర్ కాలేజీ, మదీనా ఖురానిక్ మిషన్ జూనియర్ కాలేజీ, సెయింట్ డానియల్ జూనియర్ కాలేజీ వంటి కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపును ఇంటర్ బోర్డు ప్రకటించలేదని సమాచారం. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయా కాలేజీల్లో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ బోర్డు ప్రత్యేక అవకాశాన్ని కల్పించినట్టు తెలిసింది. ఆయా కాలేజీలకు దగ్గరలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలంటూ ఆదేశాలు విడుదల చేసింది. ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఆ విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫీజు కట్టేలా డీఐఈవోలు, నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.