Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ పరిరక్షణే ధేయ్యం
- ఓలా, ఉబర్‌కు అడ్డుకట్టేసి.. కేరళ తరహా యాప్ తేవాలి
- ఎంవీ యాక్ట్-2019ను సవరించాలి
- కార్మికులపై ఓవర్ లోడ్ పెనాల్టీ భారాలు తగ్గించాలి
- నేడు నగరంలోకి రవాణారంగ కార్మికుల సంఘర్ష యాత్ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
సమాజ కదలికకు కీలకమైన రవాణారంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. రవాణారంగ కార్మికులు నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడు తున్నారు. ప్రత్యేకంగా మోటార్ వాహన చట్టం-2019 వచ్చిన తర్వాత కార్మికుల మీద ఏదో ఒక పేరుతో జరిమానాలు, చలాన్లు విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఇదో రకమైన దోపిడే. ఉదాహరణకు ఒక గూడ్స్ డ్రైవర్ కిరాయి రూ.20వేలు మాట్లాడుకుంటే.. ఓవర్‌లోడ్ పేరుతో రూ.27 వేల నుంచి లక్ష వరకు జరిమానా వేస్తున్నారు. ఇదిలావుంటే ప్రయివేటు అగ్రిగేటర్స్ సంస్థల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. దీని నుంచి కార్మికులను కాపాడాలంటే ఓలా, ఉబర్ ట్యాక్సీ ఆధారిత సంస్థలను రద్దు చేసి.. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న 'సవారీ' తరహాలో ఇక్కడ ఒక యాప్ తీసుకురావాలి.
హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి మెట్రోసిటీ, పలు కార్పొరేషన్లలో వెహికల్ పార్కింగ్ స్థలాలు లేక అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, రవాణాశాఖ, పోలీస్ ట్రాఫిక్ విభాగం స్థలాలు గుర్తించి కార్మికులకు అనువైన చోటు కేటాయించాలి. ఎంవీ యాక్ట్‌తో సాధారణ డ్రైవర్ పెనాల్టీతో ఇబ్బంది పడుతుంటే, ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉన్నది. ఆర్టీసీలో యూనియన్లు అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య. అలాగే ఆటో కార్మికులకు నూతన పర్మిట్లు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో రవాణా కార్మికుల రక్షణకు సంక్షేమ బోర్డు ఏర్పాటు తక్షణ అవసరం. దీని సాధనే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్-సీఐటీయూ) 'సంఘర్ష యాత్ర' మొదలుపెట్టింది. ఈనెల 3న ఖమ్మంలో ప్రారంభమైన ఈ యాత్రకు కార్మికులు, ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. యాత్ర నేడు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుంది.
12లక్షల మందికి బెనిఫిట్
రాష్ట్రంలో సుమారు 20లక్షల మందికిపైగా కార్మికులు రవాణా రంగంలో పనిచేస్తున్నారు. ఇందులో 12 లక్షల మంది సంక్షేమ బోర్డు పరిధిలోకి రారు. ఫలితంగా వీరు చిన్న ప్రమాదం జరిగి గాయపడినప్పుడు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏఐఆర్టీ డబ్ల్యూఎఫ్ ఆలిండియా కమిటీ 2006 అప్పటి ప్రధానికి ఇచ్చిన వినతిపత్రం మేరకు.. వి.వి.గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ సంస్థ సిఫార్సుల మేరకు దేశవ్యాప్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పింది. అంతేగాక ఒక్క కార్మికుడు పనిచేస్తున్న చోట కూడా సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని సూచించింది.
15ఏండ్లు గడిచినా అవి అమలుకు నోచుకోవడం లేదు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమానికి పాటుపడు తున్నది. తెలంగాణ లోనూ ఆ తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆదాయం..జరిమానాలకే
వాస్తవానికి రవాణారంగం రాష్ట్రాల పరిధిలోనిది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం-2019 అమలులోకి వచ్చిన దగ్గర నుంచి రవాణా కార్మికులకు వచ్చే కాసింత ఆదాయం కూడా పెనాల్టీలు, జరిమానాల పేరుతో లాగేసుకుంటుంది. పెనాల్టీలను, పర్మిట్లను పెంచడం ద్వారా ప్రమాదాలను తగ్గిస్తామని చెప్పి.. ఎలాంటి మౌలిక సౌకర్యాలూ కల్పించడంకుండా.. సాధారణ వాహన యజమాని, కార్మికుడు భరించలేనంత స్థాయిలో రూ.వెయ్యి నుంచి లక్ష వరకు ఫైన్‌తో పాటు మూడేండ్ల జైలు శిక్ష విధిస్తున్నారు. సిగల్ జంప్, స్టాప్‌లైన్ దాటితే, తప్పు ఓవర్ టెక్ వంటి వాటికి పదివేల ఫైన్ వేస్తుండటం గమనార్హం.
పెను ప్రమాదంలోకి ఆర్టీసీ
మోటార్ వాహన చట్టం-19 వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ పెను ప్రమాదంలోకి వెళ్లింది. పర్మిట్ విధానంలో మార్పులు చేస్తూ కాంట్రాక్ట్ క్యారేజీ, స్టేజ్ క్యారేజీలుగా ఉన్న పర్మిట్లను నేషనల్ పర్మిట్‌గా మార్పు చేసి.. ప్రయివేటు వాహన యజమానులకు కూడా ఆర్టీసీలాగే నడుపుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా ఆర్టీసీకి మరణ శాసనంగా మారింది. ఆర్టీసీ యాక్ట్ 1950 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 రేషియోలో మూలధన పెట్టుబడి పెట్టాలి. కానీ 1988 నుంచి ఇవ్వడం లేదు. పైగా ఆర్టీసీ ఇస్తున్న సబిడ్సీలనూ పూర్తిగా చెల్లించడం లేదు.
ఆర్టీసీలను ప్రజా రవాణా సంస్థలుగా కాకుండా లాభనష్టాల ప్రతిపాదికన చూస్తున్నారు. మరోవైపు పెద్దఎత్తున అద్దె బస్సుల సంఖ్య అంతకంతకు పెంచుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజలందరిపై ఉంది. అదే సమయంలో ఆర్టీసీలో 2019 నుంచి కార్మికోద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి తానేమీ తక్కువ కాదంటోంది. ఆర్టీసీలో యూనియన్లు ఎత్తేసిన తర్వాత కార్మికులపై యాజమాన్యం విపరీతంగా పనిభారం పెంచిందని వారు చెబుతున్నారు. సెలవులు ఇవ్వడం లేదు. వేధింపులు పెరిగిపోతున్నాయని కార్మికులు వాపోతున్నారు.
'సవారీ' యాప్‌ను దేశమంతటా అమలు చేయాలి
ప్రయివేటు అగ్రిగేటర్స్ సంస్థల దోపిడీ నుంచి కేరళ రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 'సవారీ' యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది. త్వరలో రాష్ట్రమంతా విస్తరించబోతున్నది. ప్రస్తుతం ఓలా, ఊబర్ సంస్థలు రాష్ట్రంలో 35శాతం కమీషన్ తీసుకుంటుండగా.. కేరళలో 8శాతమే కమీషన్‌గా తీసుకుంటున్నాయి. అలా తీసుకున్నదాంటో 6శాతం కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తుండగా.. 2శాతం యాప్ నిర్వహణ కోసం కేటాయించారు. దీంతో పాటు డ్రైవర్, ప్రయాణికుల రక్షణకు అనేక ఫీచర్స్ అక్కడి ప్రభుత్వం తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థను తీసుకొస్తే ఆ కమిషన్‌ను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు. తద్వారా రవాణా కార్మికులకు మేలు చేయవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లకు ఎదైనా యాప్ రూపొందించే వరకు ఓలా, ఊబర్ యాప్ ఆధారిత కంపెనీలు తీసుకుంటున్న కమీషన్‌ను 35శాతం నుంచి 5శాతానికి తగ్గించి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి.
ఓవర్ లోడ్ పెనాల్టీలను తగ్గించాలి
డి.కిషన్- సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు
రవాణారంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మోటార్‌వాహన చట్టాన్ని సవరించాలి. పెంచిన ఓవర్ లోడ్ పెనాల్టీలను తగ్గించాలి. కార్మికులు కోరిన చోట పార్కింగ్, అడ్డాలు కేటాయించాలి. ప్రమాదబీమా రూ.10 లక్షలకు పెంచాలి. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : కె.అజయ్ బాబు,ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
రవాణ రంగ కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎంవీ యాక్ట్-2019ని రద్దు చేసి.. అధిక జరిమానాలు, పెనాల్టీల భారాల నుంచి కార్మికులను కాపాడాలి. కేరళ రాష్ట్రంలోని సవారీ యాప్ తరహా యాప్‌ను దేశవ్యాప్తంగా తేవాలి. ఆర్టీసీ కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తివేయాలి. పెంచిన ఓవర్ లోడ్ పెనాల్టీ తగ్గించాలి. కార్మికులు కోరినచోట పార్కింగ్ స్థలాలు కేటాయించాలి.