Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులను వేధించిన కేసులో నిందితుడు ప్రదీప్‌ను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న సంఘటనపై విద్యార్థినులు కళాశాల ఎదుట ఆందోళన చేసిన విషయం విదితమే. తక్షణమే పోలీసులు రంగంలోకి దిగి నిందితున్ని విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు నెలలుగా 8 మంది విద్యార్థినుల ఫొటోలను మార్ఫింగ్ చేసిన ప్రదీప్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు బాధితులు ఆరోపించారు. కళాశాల హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫొటోలు మార్ఫింగ్ చేయడమే కాకుండా విద్యార్థినుల సెల్‌ఫోన్‌లోని పర్సనల్ డేటా మొత్తాన్ని నిందితుడు హ్యాక్ చేసినట్టు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ముందే సంక్రాంతి సెలవులను ప్రకటించింది.