Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై..
- మొయినాబాద్ పోలీసుస్టేసన్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-మొయినాబాద్
సీఎం కేసీఆర్ చరిత్ర హీనుడని, ఆయన చేపట్టిన ఫిరాయింపులకు సమాధి కట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్‌రెడ్డి మొయినాబాద్ పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఏసీపీ, సీఐలు అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పరిపాలనపైన దృష్టి పెట్టకుండా పార్టీ ఫిరాయింపులనే ప్రాతిపదికన పెట్టుకొని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారన్నారు. 2014 నుంచి 2018 వరకు ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను సంతలో పశువుల లాగా కొనుగోలు చేశాడని విమర్శించారు. నయానా భయానా ఆశలు చూపి, మంత్రి పదవి ఇవ్వడం, కాంట్రాక్టులు అప్ప చెప్పడం ద్వారా పార్టీలోకి తీసుకున్నారఅన్నారు. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క శాసనసభలో.. ఫిరాయింపులను ప్రోత్సహించడం మానేసి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిస్ఘాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని పదేపదే సీఎం కేసీఆర్‌ను హెచ్చరించినా పేడ చెవిన పెట్టారని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా తత్సర్యం చేసి 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు ఒప్పుకున్న తర్వాత 12 మంది శాసనసభ్యలను స్పీకర్ నిబంధనలు ఉల్లంఘించి బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని ప్రకటించారని అన్నారు. పార్టీలో చేరిన సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవి, రేగా కాంతారావుకి విప్ పదవి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మూసి రివర్ డెవలప్మెంట్ చైర్మెన్ పదవి ఇచ్చారని, వీరే కాక మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టులు ఆశ చూపారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారే ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆంశం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగిస్తే, బీజేపీ కోర్టును ఆశ్రయించి సీబీఐకి అప్పగించేలా చేసిందన్నారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ద్వారా లబ్ది పొందారని, వారికి సంబంధించిన వివరాలను పోలీసులకు అందజేసినట్టు తెలిపారు. వారు సీబీఐకి ఆ వివరాలను బదిలీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.