Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి
- వినూత్నంగా దున్నపోతుకు వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి, దున్నపోతుకు తేడా లేదని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి విమర్శించింది. శుక్రవారం హైదరాబాద్లోని హబ్సిగూడలో 'మా గోడు వినండి టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్' అంటూ వినూత్నంగా దున్నపోతుకు పలువురు అభ్యర్థులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వలీ ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర (ఏఐవైఎఫ్), సలీంపాషా (యువజన సమితి), రెహ్మాన్, ఉదరు, సతీష్ కుమార్ (ఏఐఎస్ఎఫ్), అశోక్ రెడ్డి(ఎస్ఎఫ్ఐ), శివానంద్ (టీఎన్ఎస్ఎఫ్), అరుణ్ కుమార్ (విద్యార్థి జన సమితి) ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్ష విభాగాల్లో జరిగిన నష్టంపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికారులు, మంత్రులను వివిధ రూపాల్లో కలిసి అభ్యర్ధించినా పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. మొద్దు నిద్రలో పయనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో దున్నపోతుకు వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. ఎన్నో ఆకాంక్షలతో పోలీసు ఉద్యోగాలను సాధించాలనే అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ ఏకపక్ష నిర్ణయాలతోనే అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని తెలిపారు. ఆ చైర్మెన్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల తొమ్మిదో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1,600, 800 పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరికీ మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్ష మల్టీపుల్ పరీక్షలో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలకు మార్కులు కలపాలని తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుగా వచ్చిన ప్రశ్నలన్నింటికీ మార్కులను కలపాలని కోరారు.