Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహెడలో చేపల హోల్‌సేల్ మార్కెట్ : మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా కోహెడలో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి ఇదే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. షీఫ్ ఫెడరేషన్ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్, విజయ డెయిరీ చైర్మెన్ సోమా భరత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాంభూక్యా, డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏసీఈవో మంజువాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సుమారు రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరానికి సమీపంలోని కోహెడలో 10 ఎకరాల విస్తీర్ణంలో చేపల హోల్‌సేల్ మార్కెట్‌ను నిర్మించడం జరుగుతున్నదని తెలిపారు. ఇందులో హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లు, కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదను తక్కువ ధరకు అమ్ముకోవడం ద్వారా మత్స్యకారులు నష్టపోకుండా ఉండేందుకు మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ఈ హోల్ సేల్ మార్కెట్ అందుబాటులోకి వస్తే చేపలకు మంచి ధర లభించి మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఆధునిక పద్దతులతో మార్కెట్ ను నిర్మించేందుకు ఇతర రాష్ట్రాలలో ఉన్న మార్కెట్ లను పరిశీలించి అధ్యయనం చేయాలని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. మత్స్యకారుల సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అర్హులైన మత్స్యకారుల స్కిల్ టెస్ట్‌లో అవసరమైన శిక్షణ ఇవ్వాలని చెప్పారు.
అన్ని జిల్లాల్లో గొర్రెలు, మేకల మార్కెట్ల నిర్మాణం
అన్ని జిల్లాల్లో గొర్రెలు, మేకల మార్కెట్ల నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని డైరెక్టర్ రామచందర్‌ను మంత్రి ఆదేశించారు. పెద్దపల్లి, ఖమ్మం, కామారెడ్డి తదితర జిల్లాల్లో స్థలాలను గుర్తించడం జరిగిందనీ, అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మిగిలిన జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో వారం రోజుల్లోగా స్థల సేకరణ చేయాలని సూచించారు. జీవాలకు సకాలంలో వ్యాక్సిన్లు, నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఏ సమయంలో ఏయే జీవాలకు ఏయే మందులు వేయాలో గుర్తించేలా హెల్త్ క్యాలెండర్ రూపొందించినట్టు పేర్కొన్నారు. గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని ఫిిబ్రవరిలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. సంచార పశువైద్యశాలల (1962) ద్వారా జీవాలకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు నాణ్యమైన పశుసంపద ఉత్పత్తి కోసం నిర్వహిస్తున్న కత్రిమ గర్భధారణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన మాంసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాత్మకంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒక అత్యాధునిక ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.