Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటికెళ్లి అందజేసిన రైల్వే అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాధారణంగా ప్రయాణాల్లో వస్తువులను మరచి పోవడం.. పోగొట్టుకోవడం సహజం. అట్లాగే రైలు ప్రయాణంలో ఓ పాప తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టు కున్నది. ఆ పాప పడిన బాధవర్ణాతీతం. ఆ చిన్నారిని బుజ్జగించడం తల్లిదండ్రులకు ఎంతో కష్టమైంది. ఇదంతా గమనించిన తోటి ప్రయాణికుడు రైల్వే అధికారుల కు ఫిర్యాదు చేశాడు. రైల్వేశాఖ అధికారులు చాలెంజింగ్‌గా తీసుకుని మరీ బొమ్మను వెతికిపట్టుకున్నారు. ఊరు..పేరు..అడ్రస్ ఇలా ఏవీ తెలియకున్నా శోధించి మరీ చిన్నారికి బొమ్మను అందించారు.. పోయిన బొమ్మ దొరికడంతో ఆ చిన్నారి పొందిన సంతోషం, అనుభూతి వర్ణాతీతం. భూసిన్ పట్నాయక్ అనే వ్యక్తి ఈ నెల నాలుగో తేదీన సికింద్రాబాద్-అగర్తలా ప్రత్యేక రైలులోని కోచ్నెంబర్ బీ-2లో ప్రయాణం చేశాడు. అదే కోచ్‌లో తన పక్కబెర్తులో ఓ చిన్నారి కూర్చున్నది. అనుకోని పరిస్థితుల్లో ఆ చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకున్నది. దాని కోసం ఎంతో ఏడ్చింది. ఆపడం తల్లిదండ్రులకు అసాధ్యమైంది. పక్కనే ఉన్న భూసిన్ మాత్రం ఆ పాప ఏడుపుచూసి చలించిపోయాడు. బొమ్మను ఎలాగైనా తిరిగి ఇవ్వాలని ఆలోచించాడు. రైల్వేలో మద్దద్ యాప్ ద్వారా 139 అనే నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. మానవతా దృక్పథంతో ఆలోచించిన రైల్వే శాఖ సిబ్బంది, ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు న్యూ జల్పైగురి స్టేషన్‌కు ముందుగా చిన్నారి పోగొట్టుకున్న బొమ్మ రైల్వే సిబ్బందికి దొరికింది. దానిని చిన్నారికి అందిం చాలని అధికారులు నిర్ణయించారు. సదరు చిన్నారి వివరా లను సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా రిజర్వేషన్ చార్ట్ నుంచి అతి కష్టం మీద చిరునామా వెతికి పట్టుకోవడంలో రైల్వేసిబ్బంది సఫలీకృతమయ్యారు. చిన్నారి తల్లిదండ్రులు మోహిత్ర్జా, నస్రీన్ బేగం, గ్రామం ఖాజీ గావ్, ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా అని గుర్తించారు. అలియాబరి స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి వెళ్లి చిన్నారికి రైల్వే శాఖ అధికారులు బొమ్మను అందించారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పాప బొమ్మను చూసుకుని మురిసిపోయింది. ఈ సందర్బంగా చిన్నారి తండ్రి మోహిత్ మాట్లాడుతూ 'మా చిన్నారి(19 నెలలు) ఎంతో ఇష్టమైన బొమ్మను రైలులో పోగొట్టుకున్నది. ఎంతో రోధించింది. నాక్కూడా బాధైనా ఏమీ చేయలేక పోయాను. ఈ విషయంలో తనకు సహాయం చేస్తారని అనుకోలేదు. బొమ్మేకదా అని ఫిర్యాదూ చేయలేదు. చివరకు రైల్వే మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశారు. ఇంటికి సిబ్బంది వచ్చి బొమ్మను అందించారు. ఈ మధురమైన అను భూతి నన్ను మంత్రముగ్ధుడ్ని చేసింది' అన్నారు. రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బొమ్మ కోసం రైల్వేశాఖకు ఫిర్యాదు చేసి ఆ బొమ్మను తిరిగి ఇప్పించడంలో కీలకపాత్ర పోషించిన భూసిన్ పట్నాయక్‌ను, రైల్వే సిబ్బంది కృషిని పలువురు అభినందించారు.