Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గానికే ఇండ్ల పట్టాలు
- జిల్లాలో 830 మందికి పంపిణీ
- కేసీఆర్, బీఆర్ఎస్ను నిండు మనస్సుతో ఆశీర్వదించండి : మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-పటాన్చెరు
పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జీ.ఓ నంబర్ 58 ద్వారా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 738 మంది లబ్దిదారులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఇండ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇండ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్చెరు అని తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి పారదర్శకతతో పట్టాలు పంపిణీ చేశామన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులకు మంత్రి అభినందనలు తెలి పారు. సంగారెడ్డి జిల్లాలో 830 మందికి జీఓ నంబర్ 58 ద్వారా ఇండ్ల పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇండ్ల పట్టాలు తీసుకున్నవారు నేటి నుంచి ఇంటి యాజమానులుగా మారారని ఆనందం వ్యక్తం చేశారు. పేదల కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 13 బస్తీ దవా ఖానాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాబోయే నెల రోజుల్లో జి.ఓ నంబర్ 59 ద్వారా ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ప్రభాకర్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మెన్లు, కార్పొరేటర్లు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.